‘జేఈఈ-నీట్‌ పరీక్షల ఊసే లేదు’

30 Aug, 2020 15:20 IST|Sakshi

మన్‌ కీ బాత్‌పై రాహుల్‌ వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆదివారం విమర్శల దాడి చేశారు. మన్‌ కీ బాత్‌లో మోదీ పరీక్షలపై చర్చ చేపడతారని జేఈఈ-నీట్‌ అభ్యర్ధులు ఆశించగా ఆయన బొమ్మలపై మాట్లాడారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ను టాయ్‌ హబ్‌గా మలచాలని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్‌ ఆరోపణలు గుప్పించారు. జేఈఈ-నీట్‌ పరీక్షల నిర్వహణపై మోదీ చర్చిస్తారని విధ్యార్ధులు భావిస్తే ప్రధానమంత్రి మాత్రం బొమ్మలపై చర్చ చేశారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ప్రధానమంత్రి మోదీ అంతకుముందు రేడియో కార్యక్రమం మన్‌ కీ బాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ స్ధానికంగా బొమ్మల తయారీకి స్టార్టప్‌ వాణిజ్యవేత్తలు బృందంగా పనిచేయాలని కోరారు.

అంతర్జాతీయంగా బొమ్మల పరిశ్రమ 7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ను కలిగిఉంటే ఇందులో భారత్‌ వాటా అత్యల్పమని చెప్పారు. బొమ్మల తయారీలో భారత్‌ గ్లోబల్‌ హబ్‌గా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యం భారత్‌కు ఉందని అన్నారు. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబర్‌లో జేఈఈ, నీట్‌ పరీక్షలను కేంద్రం నిర్వహించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. జేఈఈ (మెయిన్‌) పరీక్షలు సెప్టెంబర్‌ 1 నుంచి 6 మధ్య జరగనుండగా, నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13న జరగనుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. చదవండి : ‘రాహుల్‌కు కాంగ్రెస్‌ కట్టప్పల ద్రోహం’

మరిన్ని వార్తలు