University Bills: అసలేం జరుగుతోంది?.. ముదురుతున్న వివాదం.. సబిత వ్యాఖ్యలపై స్పందించిన రాజ్‌భవన్‌

8 Nov, 2022 18:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెండింగ్‌ బిల్లులపై వివాదం ముదురుతోంది. యూనివర్శిటీ బిల్లు విషయంలో తనకు ఎలాంటి సమాచారం రాలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాజ్‌భవన్‌ వర్గాలు స్పందించాయి. గవర్నర్‌ నుంచి లేఖ రాలేదనడం సరికాదని, యూనివర్శిటీల బిల్లు వ్యవహారంపై మెసెంజర్‌ ద్వారా నిన్ననే(సోమవారం) సమాచారం ఇచ్చామని రాజ్‌భవన్‌ పేర్కొంది.
చదవండి: తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌.. ప్రధాని మోదీ పర్యటనపై వివాదం

కాగా, ‘తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు–2022’ విషయంలో పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై రాజ్‌భవన్‌కు వచ్చి తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సోమవారం గవర్నర్‌ లేఖ రాశారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇప్పుడున్న విధానంలో ఇబ్బందులేమిటని.. కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలాగని ప్రశ్నించారు. కొంతకాలం నుంచి రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై లేఖలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి విద్యా మంత్రికి రాసిన లేఖలో గవర్నర్‌ పలు సందేహాలు లేవనెత్తారు.

ఈ క్రమంలో ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే పరస్పరం బహిరంగ ఆరోపణలు, విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పుడీ విభేదాలు ముదిరినట్టుగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్‌ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంతో విభేదాలు బయటపడ్డాయి. సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లేందుకు గవర్నర్‌ హెలికాప్టర్‌ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వివాదంగా మారింది. తర్వాత గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కే పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించడం పట్ల గవర్నర్‌ బహిరంగంగానే విమర్శలు చేశారు.

మరిన్ని వార్తలు