Rajasthan Assembly elections 2023: బీజేపీ గుండెల్లో రె‘బెల్స్‌’

19 Nov, 2023 04:16 IST|Sakshi

2018 లో రాజస్థాన్ పుట్టి ముంచిన వైనం

ఈ సారి బరిలో తిరుగుబాటు అభ్యర్థులు

రాజస్తాన్‌లో తిరుగుబాటు నేతలు బీజేపీకి దడ పుట్టిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేసిన చరిత్ర వారిది! ఆ ఎన్నికల్లో చివరి క్షణంలో పార్టీ మొండి చేయి చూపడంతో ఆగ్రహించి డజను మంది నేతలు స్వతంత్రులుగా బరిలో దిగారు. తాము ఓడటమే గాక బీజేపీ అభ్యర్థులను కూడా ఓడించి కాంగ్రెస్‌ నెత్తిన పాలు పోశారు.

అదే సమయంలో 2018లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసిన 13 మందిలో ఏకంగా 12 మంది విజయం సాధించడం విశేషం. పైగా ఫలితాలు వెలువడగానే వారంతా కాంగ్రెస్‌ గూటికే చేరుకున్నారు. అలా నికరంగా ఆ పార్టీకి పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఈసారి కూడా రెండు పార్టీల నుంచీ రెబెల్స్‌ రంగంలో ఉన్న నేపథ్యంలో వారు ఎవరికి చేటు చేస్తారోనన్న చర్చ జరుగుతోంది...!

రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 830 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో 13 మంది కాంగ్రెస్, 12 మంది బీజేపీ నేతలున్నారు. పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో వారు తిరుగుబావుటా ఎగరేశారు. కాంగ్రెస్‌ రెబెల్స్‌లో ఏకంగా 12 మంది గెలవడమే గాక ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి వారిలో 10 మందికి సీఎం అశోక్‌ గహ్లోత్‌ కాంగ్రెస్‌ టికెట్లు కూడా ఇప్పించారు. మరోవైపు 12 మంది బీజేపీ రెబల్స్‌లో ఒక్కరు కూడా నెగ్గలేదు.

కుల్‌దీప్‌ ధన్‌ఖడ్, దేవీసింగ్‌ షెకావత్, ధన్‌సింగ్‌ రావత్, హేమ్‌సింగ్‌ భడానా వంటి పెద్ద నాయకులు కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాకపోతే ఈ 12 మందీ తమ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులందరినీ ఓడించారు. అలా రెబెల్స్‌ దెబ్బకు బీజేపీ బాగా నష్టపోయింది. బీజేపీకి 73 సీట్లు రాగా కాంగ్రెస్‌ 100 స్థానాల్లో నెగ్గడం తెలిసిందే. 2013లో కూడా కాంగ్రెస్‌ రెబెల్స్‌లో చాలామంది నెగ్గగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల్లో అత్యధికులు ఓటమి చవిచూశారు.

ఈసారి కూడా రాష్ట్రంలో ఏకంగా 737 మంది స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్‌ టికెట్లు ఆశించి భంగపడ్డ వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తమ్మీద 18 మంది బీజేపీ రెబెల్స్, 14 మంది కాంగ్రెస్‌ రెబెల్స్‌ స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం ఆ పారీ్టలపై ఎలా ఉంటుందన్నది ఫలితాల అనంతరమే తేలనుంది. రాష్ట్రంలో నవంబర్‌ 25న పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు మిగతా 4 రాష్ట్రాలతో పాటు డిసెంబర్‌ 3న వెల్లడవుతాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు