ఆవును అసెంబ్లీకి తీసుకెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే.. పారిపోయి షాక్ ఇచ్చిన గోమాత

21 Sep, 2022 16:52 IST|Sakshi

జైపూర్: రాజస్థాన్ బీజేపీ ఎ‍మ్మెల్యే సురేష్ సింగ్ రావత్.. అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆవును అసెంబ్లీ ఆవరణలోకి తీసుకెళ్లారు. లంపీ స్కిన్ వ్యాధితో అనేక పశువులు చనిపోతున్నాయని, కానీ గాఢ నిద్రలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గోవుతో వచ్చినట్లు చెప్పారు.

అయితే రావత్‌ ప్రయత్నం బెడిసికొట్టింది. అసెంబ్లీ గేటు వద్ద గోవు పక్కన నిల్చోని ఆయన మీడియాతో మాట్లాడే సమయంలోనే అది పారిపోయింది. దాన్ని చైన్‌తో పట్టుకుని ఉన్న వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా పరుగులు పెట్టింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోమాతను అసెంబ్లీకి తీసుకొచ్చిన బీజేపీ ఎ‍మ్మెల్యేకు ఏం జరిగిందో చూడండి అని కాంగ్రెస్ దీనిపై సెటైర్లు వేసింది.

అయితే రావత్ మాత్రం దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. చివరకు గోవులు కూడా ఈ కఠినమైన ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయని, అందుకే ఆ ఆవు పారిపోయిందని చెప్పుకొచ్చారు. కాగా.. సోమవారం పశుసంవర్ధక శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం లంపీ స్కిన్ వ్యాధితో 59,027 పశువులు చనిపోయాయి. 13,02,907 మూగజీవాలు ప్రభావితమయ్యాయి.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్‌ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు