సోనియాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన అశోక్‌ గహ్లోత్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అయోమయం!

28 Sep, 2022 13:00 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న తరుణంలో సీఎం అశోక్ గహ్లోత్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కీలక భేటీ కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో సీఎం పదవిని వదులుకుని గహ్లోత్‌ పోటీ చేస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.

మొన్నటివరకు కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గహ్లోతే ముందు వరుసలో ఉన్నారు. గాంధీ కుటుంబం మద్దతు ఉన్నందున కచ్చితంగా ఆయనే గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ రాజస్థాన్‌లో ఆయన వర్గం ఎమ్మెల్యేలు చేసిన రచ్చతో ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వంపైనే ఆయోమయం నెలకొంది. సచిన్ పైలట్‌ను సీఎం చేయడాని వీల్లేదని 92 మంది గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామని బెదిరించడం పార్టీ హైకమాండ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. ఈ విషయంపై సోనియా గాంధీ కూడా కన్నెర్రజేసినట్లు తెలుస్తోంది.

అయితే గహ్లోత్ మాత్రం ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని అధిష్ఠానంకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎ‍మ్మెల్యేల హైడ్రామా జరిగిన రోజు తాను సరిహద్దు ప్రాంతంలో పర్యటనలో ఉన్నానని, అక్కడ సెల్‌ఫోన్‌ సిగ్నల్ కూడా లేదని చెప్పినట్లు సమాచారం. కానీ అదిష్ఠానం గహ్లోత్ వివరణ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్‌లో అలజడికి గహ్లోత్ కారణం కాదని, ఆయన వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలే ఇదంతా చేసినట్లు అధిష్ఠానికి అందిన నివేదికలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

ఈ నేపథ్యంలో సోనియాతో గహ్లోత్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎంగా, పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతాని గహ్లోత్ గతంలోనే చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ అందుకు ఒప్పుకుంటుందా? లేక అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకొని ఆయన సీఎంగానే కొనసాగుతారా? లేక ఆ పదవిని వదులుకుని పోటీ చేస్తారా? అనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై కొన్ని గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్‌ఐపై నిషేధం

మరిన్ని వార్తలు