సత్యం పక్షాన నిలబడండి

10 Aug, 2020 03:13 IST|Sakshi

రాజస్తాన్‌ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గహ్లోత్‌ లేఖ

జైపూర్‌: ఆగస్టు 14 నుంచి రాజస్తాన్‌ అసెంబ్లీ సమావేశాలు జరగునున్న నేపథ్యంలో రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ‘సత్యం పక్షాన నిలవండి–ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’అంటూ లేఖ ద్వారా శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. సచిన్‌ పైలెట్‌ తనకు అనుకూలమైన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయటంతో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. విశ్వాస పరీక్ష కోసం ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి పార్టీ చేసిన వాగ్దానాలను పరిపూర్తి చేయడానికి ఎమ్మెల్యేలంతా సహకరించాలని ఆ లేఖలో గహ్లోత్‌ కోరారు.

మీరు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ, మీరంతా ప్రజాపక్షం వహించాలని, తప్పుడు సాంప్రదాయాలను తిరస్కరించాలని, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయడానికి, ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి’’అని లేఖలో వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి జరిగే ప్రయత్నాలేవీ సఫలం కావని కూడా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సచిన్‌ పైలెట్‌ తిరుగుబాటు చేసిన అనంతరం ఆయనను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తొలగించారు. ఇప్పటికీ గహ్లోత్‌కే నంబర్‌ గేమ్‌లో మెజారిటీ ఉంటుందని కొందరి బలమైన విశ్వాసం.  

11న బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ 11న భేటీ కానుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్యేలందరికీ ప్రతిపక్ష నేత గులాబ్‌ చంద్‌ కటారియా లేఖ రాశారు. 11న సాయంత్రం 4 గంటలకు జైపూర్‌లోని హోటల్‌ క్రౌన్‌ ప్లాజాలో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌కి తరలించింది. శనివారం ఆరుగురు శాసనసభ్యులు పోరుబందర్‌కి తరలివెళ్ళగా, మరో 12 మంది ఎమ్మెల్యేలు అహ్మదాబాద్‌ తరలి వెళ్ళారు.  కాంగ్రెస్‌ పార్టీ తన ఎమ్మెల్యేలందర్నీ ఒకచోట ఉంచినట్లే, బీజేపీ కూడా  తరలించిందని భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా