-

ముచ్చటగా మూడోసారి

29 Jul, 2020 01:53 IST|Sakshi

అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని గవర్నర్‌ను కోరిన రాజస్తాన్‌ సీఎం

ఇప్పటికే రెండు ప్రతిపాదనలను వెనక్కు పంపిన గవర్నర్‌

జైపూర్‌: రాజస్తాన్‌లో అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించే విషయంలో అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం, గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాల మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాల డ్రామా కొనసాగుతోంది. తాజాగా, ఈ నెల 31 నుంచే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కేబినెట్‌ మంగళవారం మరో ఫైల్‌ను గవర్నర్‌ వద్దకు పంపించింది. వివిధ కారణాలు చూపుతూ ఇప్పటివరకు కేబినెట్‌ పంపించిన రెండు ప్రతిపాదనలను గవర్నర్‌ మిశ్రా వెనక్కు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం పంపించిన ప్రతిపాదనలోనూ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించే విషయాన్ని గహ్లోత్‌ సర్కారు ప్రస్తావించలేదు.

కేబినెట్‌ పంపించిన రెండో ప్రతిపాదనను వెనక్కు పంపిస్తూ.. ఎజెండాలో విశ్వాస పరీక్ష ఉంటే స్వల్ప కాల నోటీసుతో అసెంబ్లీని సమావేశపర్చే వీలుందని గవర్నర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తాజా ప్రతిపాదనలోనూ గహ్లోత్‌ ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. రెండో సారి పంపిన ప్రతిపాదనలో పేర్కొన్నట్లుగానే.. ఈ నెల 31 నుంచి అసెంబ్లీ భేటీలను ప్రారంభించాలని మాత్రమే తాజా ఫైల్‌లోనూ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండాను బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ నిర్ణయిస్తుందని, కోవిడ్‌–19 నిబంధనల అమలును స్పీకర్‌ పర్యవేక్షిస్తారని మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీ అనంతరం రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సింగ్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ మిశ్రా ఇలా పక్షపాత వైఖరితో వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. 

షెకావత్‌పై కేసు విషయంలో స్పందించండి 
సహకార సంఘం కుంభకోణం కేసులో  కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌పై దర్యాప్తు జరపాలని కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలపాల్సిందిగా రాజస్తాన్‌ ప్రభుత్వాన్ని మంగళవారం ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. రూ. 884 కోట్ల సంజీవని క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ స్కామ్‌లో దర్యాప్తు జరపాలని కింది కోర్టు గతంలో ఆదేశించింది.  

బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై మళ్లీ కోర్టుకు 
ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని, దానిపై తను చేసిన ఫిర్యాదును స్పీకర్‌ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

‘గెట్‌ వెల్‌ సూన్‌ గవర్నర్‌’ 
గవర్నర్‌ సత్వరమే రాజస్తాన్‌ అసెంబ్లీని సమావేశపర్చాలని, పక్షపాతవైఖరి విడనాడాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ‘గెట్‌ వెల్‌ సూన్‌ గవర్నర్‌’అనే ఆన్‌లైన్‌ ప్రచార కార్యక్రమాన్నిప్రారంభించింది. ‘పక్షపాత వైఖరి, అణచేయాలనే మనస్తత్వం నుంచి గవర్నర్‌ త్వరగా కోలుకోవాలి’అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ పాండే ట్వీట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు