రాజస్తాన్‌ సంక్షోభం : గహ్లోత్‌కు ఊరట

7 Aug, 2020 04:06 IST|Sakshi

బీఎస్పీ విలీనం కేసు మళ్లీ సింగిల్‌ బెంచ్‌కే..

జైపూర్‌: రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌కు స్వల్ప ఊరట. రాజస్తాన్‌లో బహుజన్‌సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ–కాంగ్రెస్‌ విలీనం కేసు మళ్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ముందుకే రానుంది. బీఎస్‌పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారిగా పరిగణించడంపై స్టే విధించేందుకు ఏకసభ్య ధర్మాసనం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది.

బీఎస్‌పీ తరఫున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలు గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేర్చుకుంటూ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మదన్‌ దిలావర్, బీఎస్‌పీ జాతీయ కార్యదర్శి సతీశ్‌ మిశ్రా వేసిన పిటిషన్లను జస్టిస్‌ మహేంద్రకుమార్‌ గోయెల్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం జూలై 30వ తేదీన విచారించింది.

ఈ మేరకు స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి, ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం..ఆగస్టు 11వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ సభ్యులుగా సభలో చలామణి కావడంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ ఆదేశాలపై బీజేపీ, బీఎస్‌పీ నేతలు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు.

దీనిపై డివిజన్‌ బెంచ్‌..  స్పీకర్‌కు బుధవారం నోటీసులు జారీ చేయగా ఎలాంటి సమాధానమూ రాలేదు. ఈ విషయమై స్పీకర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టులో వాదనలు వినిపించారు. బీజేపీ, బీఎస్పీ నేతలు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించడం చెల్లదన్నారు. ఎమ్మెల్యేల నోటీసులు అందుకోవడానికి అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయం పోస్టాఫీసు కాదని సిబల్‌ పేర్కొన్నారు. ఆ నోటీసులను జైసల్మీర్‌ జిల్లా జడ్జి ద్వారా జారీ చేయాలని, జైసల్మీర్, బార్మెర్‌ జిల్లాల రెండు పత్రికల్లో ప్రచురించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది.

>
మరిన్ని వార్తలు