పెళ్లి వేడుకలో పేలిన గ్యాస్ సిలిండర్.. 32కు చేరిన మృతులు.. సీఎం తీరుపై బీజేపీ ఫైర్..

17 Dec, 2022 16:46 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌ జోధ్‌పుర్‌లోని ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. శుక్రవారం మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

జోధ్‌పుర్‌లోని భుంగ్రా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో డిసెంబర్ 8న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 32 మంది చనిపోయారు. మిగతా వారు జోధ్‌పుర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సీఎం అశోక్ గహ్లోత్ ఇంకా ఈ గ్రామాన్ని గానీ, ఆస్పత్రిని గానీ సందర్శించకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, గ్యాస్ కంపెనీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది.

ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష‍్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. పేలుడు జరిగిన గ్రామాన్ని సీఎం ఇంకా సందర్శించలేదని ధ్వజమెత్తింది. ఇంత విషాద సమయంలో కాంగ్రెస్ మ్యూజిక్ కన్‌సర్ట్ నిర్వహించిందని మండిపడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో మ్యూజిక్ కన్‌సర్ట్ నిర్వహించింది కాంగ్రెస్. దీన్ని ఉద్దేశిస్తూ బీజేపీ గహ్లోత్ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టింది.

రూ.2 లక్షలు పరిహారం..
ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. గాయపడిన వారికి రూ.50 వేలు అందించనున్నట్లు పేర్కొంది.
చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే..

మరిన్ని వార్తలు