Rajasthan Budget: ఆహా.. ఏమి అదృష్టం! ఫ్రీగా ఐఫోన్‌లు

23 Feb, 2022 21:04 IST|Sakshi

Rajasthan Budget 2022: ఈ ఫ్రీ ఐఫోన్‌ ఆఫర్‌ కేవలం అక్కడి ప్రజాప్రతినిధులకు మాత్రమే.. గమనించగలరు. ప్రజాసేవ సంగతి ఏమోగానీ.. ప్రజాప్రతినిధులకు అందే సౌకర్యాలు మాత్రం ఘనంగా ఉంటాయి. అందుకు మరో ఉదాహరణ.. రాజస్థాన్‌లో బుధవారం కనిపించిన దృశ్యాలు. 

బుధవారం రాజస్థాన్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాల అనంతరం.. ఎమ్మెల్యేలకు ఆనవాయితీగా లెదర్‌ బ్రీఫ్‌కేసులు అందించారు. అయితే ఈసారి రాజస్థాన్‌ 200 మంది ఎమ్మెల్యేలకు అందించిన బ్రీఫ్‌కేసులో సర్‌ప్రైజ్‌గా బ్రాండ్‌ న్యూ ఐఫోన్‌ 13ను కానుకగా ఇచ్చింది ప్రభుత్వం. ఆ ఫోన్‌ కాస్ట్‌ 75 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్య ఉంది. ఇంతే కదా అనుకోకండి.. కిందటి ఏడాది ఇలాగే బడ్జెట్‌ సందర్భంగా ఐప్యాడ్‌లను ఎమ్మెల్యేలకు అందించింది అశోక్‌ గెహ్లాట్‌ సర్కార్‌. 

సాధారణంగా.. ఎమ్మెల్యేలకు బడ్జెట్‌ అయిపోగానే.. ఆ ప్రతులను ఉంచిన బ్యాగులు ఇవ్వడం పరిపాటి. కానీ, అక్కడేమో బడ్జెట్‌ పేపర్స్‌తో పాటు ఇలా కాస్ట్‌లీ గాడ్జెట్స్‌ అందించేస్తున్నారు. ఈసారి అందించిన ఐఫోన్‌ కానుకల విలువ మొత్తం కోటిన్నర రూపాయలుగా తేలింది. పార్టీలకతీతంగా సంబురంగా ఆ కానుకలు తీసుకుని.. కొత్త ఫోన్‌తో ఫొటోలకు ఫోజులిచ్చారు అక్కడి ఎమ్మెల్యేలు. ఇక అశోక్ గెహ్లాట్ సర్కార్‌.. ఎమ్మెల్యేల కోసం ఖరీదైన ఐఫోన్‌లను కొనుగోలు చేయడానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని కొందరు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో విమర్శిస్తు‍న్నారు.

మరిన్ని వార్తలు