రాజస్తాన్‌: కుటుంబ పెద్దపై అలకబూనాం అంతే!

10 Aug, 2020 20:06 IST|Sakshi

సీఎం గహ్లోత్‌కు జై కొట్టిన రెబల్‌ నేత భన్వర్‌లాల్‌

ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ

కొలిక్కి వచ్చిన రాజస్తాన్‌ రాజకీయ సంక్షోభం!

జైపూర్‌: రాజస్తాన్‌ రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చినట్టే కనబడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ అయి కొన్ని డిమాండ్లు వారి ముందు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పైలట్‌ మద్దతుదారు భన్వర్‌లాల్‌ శర్మ సీఎం అశోక్‌ గహ్లోత్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గహ్లోత్‌ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. తమ నాయకుడు గహ్లోతేనని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్‌ నేతనేనని స్పష్టం చేశారు. ‘కుటుంబం అన్నాక చిన్నచిన్న గొడవలు ఉంటాయి. కుటుంబ పెద్దపై పిల్లలు అలకబూని కొద్ది రోజులు అన్నం తినకుండా మొండికేస్తారు. మేమూ అంతే. మా నాయకుడిపై అసహనంతో నెలపాటు దూరంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని వివాదాలు సమసిపోయాయి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మా ప్రభుత్వం నెరవేర్చుతుంది’అని భన్వర్‌లాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక నిన్నటి వరకు ఉప్పు నిప్పులా సాగిన పైలట్‌, గహ్లోత్‌ మద్దతుదారుల మధ్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోవడంతో అవాక్కయ్యామంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

ఇదిలాఉండగా.. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై బయటికొచ్చిన ఆడియో టేపుల వ్యవహారాన్ని భన్వర్‌లాల్‌ తోసిపుచ్చారు. ఎలాంటి ఆడియో టేపులు లేవని, అవన్నీ అబద్దాలని పేర్కొన్నారు. తనకు గజేంద్ర సింగ్‌ మాత్రమే తెలుసని, షెకావత్‌, సంజయ్‌ జైన్‌ ఎవరో తెలియదని అన్నారు. కాగా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, బీజేపీ నేత సంజయ్‌ జైన్‌తో కలిసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గహ్లోత్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వారి సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులు కూడా కాంగ్రెస్‌ బయటపెట్టింది. ఆడియో టేపుల్లో భన్వర్‌లాల్‌ పేరు ప్రముఖంగా వినపడింది.
(రాజీ ఫార్ములాపై రాహుల్‌, పైలట్‌ మంతనాలు)

మరిన్ని వార్తలు