గుజరాత్‌ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి 

22 Oct, 2022 02:28 IST|Sakshi
శుక్రవారం చౌటుప్పల్‌ రోడ్‌ షోలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 

చౌటుప్పల్‌ రోడ్‌ షోలో ఓటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

రాజగోపాల్‌రెడ్డి ఏనాడూ ప్రజాసమస్యలను పట్టించుకోలేదు 

రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు 

జన్‌ధన్‌ ఖాతాల్లో పడాల్సిన డబ్బులన్నీ ఆయన ఖాతాలో.. 

ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ మోదీ పకోడీ మాటలంటూ ఎద్దేవా.. 

సాక్షి, యాదాద్రి: ‘‘ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్‌ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి. అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించండి’’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కోరారు. గతంలో మునుగోడు ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపించారని.. రాజగోపాల్‌రెడ్డి గెలిచిన నాటి నుంచీ బీజేపీ జపం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రజా సమస్యలను ఏనాడూ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని, ఇప్పుడు అనవసరంగా ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డబ్బు అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. శుక్రవారం రాత్రి చౌటుప్పల్‌ పట్టణంలో జరిగిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

ఆ డబ్బంతా రాజగోపాల్‌రెడ్డి ఖాతాలోకే.. 
‘‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనది చిన్న కంపెనీగా చెప్పుకొని రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా తెచ్చుకున్నారు? ఇచ్చిన పెద్దలు ఎవరు, గుజరాత్‌ గద్దలు ఎవరు? పేద ప్రజల జన్‌ధన్‌ ఖాతాల్లో 15 లక్షల చొప్పున పడాల్సిన డబ్బులన్నీ కోమటిరెడ్డి ఖాతాలో పడ్డాయి. ఇందుకోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు. రాజగోపాల్‌రెడ్డి ఇచ్చే పైసలన్నీ గుజరాత్‌ దొంగల పైసలు. దబాయించి తీసుకోండి. కానీ కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి. శివలింగం వస్తే మాది, శవం వస్తే మీది అంటూ బేకార్‌ మాటలు మాట్లాడే చిల్లర నాయళ్లకు బుద్ధిచెప్పాలి.  

మోదీవన్నీ పకోడీ మాటలు 
2016లో కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న జేపీ నడ్డా మర్రిగూడకు వచ్చి 300 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. ఇన్నేళ్లయినా తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదో, ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో బీజేపీ నేతలు చెప్పాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఇడ్లీ బండి, పకోడీ బండి పెట్టుకోవాలని యువతకు సూచిస్తున్నారు. మోదీవన్నీ పకోడీ మాటలే. నల్లధనం తెస్తానని చెప్పి తెల్లమొఖం వేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ వేశారు. రైతులకు రుణమాఫీ చేయకుండా కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేశారు. నాడు రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు రూ.1,200కు చేరింది. ఓటు వేసేటప్పుడు మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

రైతు బాంధవుడు కేసీఆర్‌.. 
గత 75 ఏళ్లలో ఎందరో ముఖ్యమంత్రులు ఆకుపచ్చ తలపాగాలు ధరించి రైతులను మోసం చేశారు. సీఎం కేసీఆర్‌ మాత్రం రైతు బంధు, రైతుబీమా వంటి ఉత్తమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రైతు పథకాలను అటుఇటు మార్చి అమలు చేస్తున్నాయి. నేను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నా. ఫలానాది కావాలని అడగకుండానే చేసి చూపిస్తా. మునుగోడు నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 48 వేల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్లు, రైతు బీమా వంటి పథకాలు అమలవుతున్నాయి. ఇక్కడి దండుమల్కాపురంలో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను నిర్మించాం. 200 కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తులు ప్రారంభించనున్నాయి. మిషన్‌ భగీరథ పథకం కోసం రూ. 19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సూచిస్తే.. 19 పైసలు కూడా ఇవ్వలేదు. చర్లగూడెం, శివన్నగూడెం ప్రాజెక్టులను సగం పూర్తి  చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే పూర్తి చేయిస్తాం.

దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌. దేశంలో అత్యధికంగా వరి పండించే జిల్లాగా నల్లగొండ జిల్లా మారింది. గత 65 ఏళ్లలో పరిష్కారం కాని ఫ్లోరోసిస్‌ సమస్యను కేసీఆర్‌ ప్రభుత్వం రూపుమాపింది..’’ అని కేటీఆర్‌ చెప్పారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోడ్‌షోలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు