రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై మళ్లీ సస్పెన్స్‌

30 Oct, 2020 05:20 IST|Sakshi

అనారోగ్య సమస్యలున్నాయన్న రజనీ

ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని వైద్యుల సలహా

సోషల్‌ మీడియాలోని లేఖ తాను రాసింది కాదన్న తలైవా

చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి వాడి వేడిగా చర్చ సాగుతోంది. రజనీ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకి బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఒక లేఖ తీవ్ర ఆందోళనకి, గందరగోళానికి గురి చేసింది. అయితే ఆ లేఖ తాను రాయలేదని స్పష్టం చేసిన రజనీ అందులో ఉన్న అనారోగ్య అంశాలు వాస్తవమేనన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని తనకు వైద్యులు సలహా ఇచ్చినట్టుగా రజనీ గురువారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

తన అనారోగ్యం గురించి ఆయన బహిరంగంగా చెప్పడం ఇదే తొలిసారి. ‘కరోనా వైరస్‌ ఉన్నంతవరకు నేను ప్రచారానికి వెళ్లడం మంచిది కాదని వైద్యులు సూచించారు. నా వయసు 70 ఏళ్లు. కిడ్నీ మార్పిడి జరిగింది. నా రోగనిరోధక వ్యవస్థ బాగా క్షీణించింది. బయటకి వెళితే సులభంగా కరోనా దాడి చేస్తుంది. వ్యాక్సిన్‌ వచ్చినా నాకు పని చేస్తుందన్న భరోసా వైద్యులు ఇవ్వడం లేదు. నేను నా ఆరోగ్యం గురించి బాధపడడం లేదు. నా చుట్టూ ఉన్న వారి క్షేమం గురించి ఆలోచిస్తున్నాను’అని మీడియాలో చక్కర్లు కొట్టిన లేఖలో ఉంది.

అనారోగ్యం వాస్తవమే: రజనీ
ఆ లేఖ తాను రాసినది కాదని వెల్లడించిన రజనీకాంత్‌ అందులో పేర్కొన్న అనారోగ్య అంశాలు వాస్తవమేనని తెలిపారు. వైద్యులు తనని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చినట్టుగా వెల్లడించారు. రజనీ మక్కల్‌ మంద్రమ్‌తో చర్చించిన తర్వాత సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.

మరిన్ని వార్తలు