రజనీ మనసులో ఏం ఉంది?

1 Dec, 2020 08:57 IST|Sakshi
రజనీ మక్కల్‌ మన్రం జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్‌ సమావేశం

సాక్షి, చెన్నై: నటుడు రజనీకాంత్‌ పార్టీని స్థాపిస్తారా ? వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా? ఏమో అనుమానమే. పార్టీ ఏర్పాటుౖ పె త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ మరోసారి దాటవేశారు. రజనీ మక్కల్‌ మన్రం జిల్లా కార్యదర్శుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

రజనీ అసంతృప్తి 
రజనీ మక్కల్‌ మన్రం జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్‌ సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నై కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మండపంలో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, మన్రం తరఫున చేపట్టిన పనులు, పార్టీని ప్రారంభించవచ్చా? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు స్వాగతిస్తారా? వంటి అంశాలపై ఆరా తీశారు. మక్కల్‌ మన్రం పనితీరుపై రజనీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ స్థాపనపై ఓ నిర్ణయానికి వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. తన పేరుకు కళంకం వచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారని.. వారిని మార్చడం మినహా మరోదారి లేదని అసహనం వ్యక్తం చేశారు.  

పార్టీ స్థాపనపై త్వరలో నిర్ణయం 
సుమారు 2 గంటలపాటు జరిగిన సమావేశం అనంతరం చెన్నై పోయస్‌గార్డన్‌లోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. జిల్లా కార్యదర్శులు తమ అభిప్రాయాలను చెప్పారని..తాను పలు అంశాలతో వారితో చర్చించానని రజనీ తెలిపారు. వీలైనంత త్వరలో ఓ నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మక్కల్‌ మన్రం జిల్లా కార్యదర్శులు అన్నారు. 

అభిమాన సందోహం 
సమావేశంలోకి జిల్లా కార్యదర్శులను మాత్రమే అనుమతించడంతో అభిమానుల సందోహంతో పరిసరాలు నిండిపోయాయి. ‘రేపటి ముఖ్యమంత్రి, రాజకీయాల్లోకి రా’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వచ్చిన కారుపై పూలవాన కురిపించారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా, రారా అనే విషయాన్ని తాము చెప్పలేమని సమావేశం అనంతరం మీడియా వద్ద జిల్లా కార్యదర్శులు వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి తప్పక వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

తప్పని ఎదురుచూపులు.. 
2017 డిసెంబరులో 5 రోజులపాటు అభిమానులతో సమావేశమైన రజనీకాంత్‌ చివరిరోజున.. ‘అరసియల్‌కు వరువదు ఉరుది’ (రాజకీయాల్లోకి రావడం ఖాయం) అని బహిరంగంగా ప్రకటించారు. రాజకీయాల్లో సిస్టమ్‌ సరిగ్గా లేదు, దాన్ని మారుద్దాం..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో పోటీచేస్తాం అని వ్యాఖ్యానించారు. అభిమాన సంఘాలను మక్కల్‌ మన్రాలుగా మార్చారు. ఇన్‌చార్జ్‌లను నియమించారు. సభ్యత్వ నమోదు చేపట్టారు.

ఈ ఏడాది ఆరంభంలో మీడియా సమావేశం పెట్టి “పార్టీని ప్రారంభించిన తరువాత అధ్యక్షుడిగా మాత్రమే వ్యవహరిస్తాను, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరో వ్యక్తి ఉంటారు’ అని స్పష్టం చేయడంతో కార్యదర్శులు, అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇదిలా ఉండగా రజనీకాంత్‌ పేరుతో ఇటీవల విడుదలైన ఉత్తరంలో తన అనారోగ్యం, కరోనా పరిస్థితుల్లో ప్రజలను కలుసుకోవడం సరికాదని వైద్యులు సూచించారని తెలిపారు. ప్రజలను కలవకుండా నేరుగా పార్టీ స్థాపించడం అసాధ్యమని చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఈ ఉత్తరం తనది కాదని.. అయితే అందులోని అంశాలు మాత్రం నిజమేనని రజనీ చెప్పారు.  

మరిన్ని వార్తలు