బీజేపీని ఓడిద్దాం

6 Sep, 2021 04:43 IST|Sakshi
కిసాన్‌ మహాపంచాయత్‌కు హాజరైన రైతులు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న రాకేశ్‌ తికాయత్‌

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఇతర బీజేపీ నేతల్ని అరాచక శక్తులుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌ గడ్డ వారిని సహించలేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఆదివారం యూపీలోని ముజఫర్‌నగర్‌లో గవర్నమెంట్‌ ఇంటర్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన మహా పంచాయత్‌కు  వేలాది మంది రైతులు తరలివచ్చారు.

‘దేశాన్ని కాపాడుకుందాం’ అన్న లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా సదస్సుకి ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 300 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. బస్సులు, కారులు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో వేలాది మంది రైతులు రావడంతో నగర వీధులు, ఫ్లై ఓవర్లు కిక్కిరిసిపోయాయి. భారీ సంఖ్యలో మహిళా రైతులు కూడా వచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ఓట్లు కూడా రాలవని తికాయత్‌ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే తమ నినాదమని స్పష్టం చేశారు.  

ఇండియా ఫర్‌ సేల్‌: కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని అదే ప్రభుత్వ విధానమని మహాపంచాయత్‌ వేదికగా రాకేశ్‌  తికాయత్‌ ఆరోపించారు. రైల్వేలు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, విద్యుత్, రోడ్లు, బ్యాంకులు ఇలా అన్నింటిని అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. సేల్‌ ఆఫ్‌ ఇండియా బోర్డులు ఎక్కడికక్కడ పెట్టారని అంబానీ, అదానీలే వాటిని కొనుగోలు చేస్తారని ఆరోపించారు.

‘‘మనం ఈ దేశాన్ని అమ్మకుండా అడ్డుకోవాలి. రైతులు, ఉద్యోగులు, యువత, వ్యాపారాలు ఇలా అన్నింటిని కాపాడు కోవాలి. అందుకే మహాపంచాయత్‌ ర్యాలీలు చేస్తున్నాం’’ అని తికాయత్‌ చెప్పారు. ‘‘9 నెలలుగా మేం ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం చర్చించడానికి ముందుకు రావడం లేదు. ఉద్యమం సమయంలో ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయినా ఈ ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం మౌనం పాటించలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు  పోరాటం ఆగదు’’ అని తికాయత్‌ చెప్పారు.  

ప్రధానే లక్ష్యం: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో ప్రధాని  మోదీ లక్ష్యంగా  ప్రచారం చేస్తామని కిసాన్‌ మహాపంచాయత్‌ ప్రకటించింది. నేరుగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేత రాకేశ్‌ తికాయత్‌ చెప్పారు.

వారణాసి వేదికగా  
ముజఫర్‌నగర్‌లో జరిగిన మెగా సదస్సుని మిషన్‌ ఉత్తరప్రదేశ్‌–ఉత్తరాఖండ్‌గా రైతు సదస్సు అభివర్ణించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మహాపంచాయత్‌లు నిర్వహిస్తామన్న రాకేశ్‌ తికాయత్‌ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి రెండో ప్రధాని కార్యాలయం వంటిదని తదుపరి సదస్సు అక్కడే జరుపుతామన్నారు. లక్నోలో సదస్సు నిర్వహించి రైతుల సత్తా  చాటుతామన్నారు.

మరిన్ని వార్తలు