రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీ

12 Aug, 2020 03:46 IST|Sakshi

ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలి

పార్టీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ దిశానిర్దేశం

‘సోము’ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ప్రసంగం

సాక్షి, అమరావతి: ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చెబుతున్నది మాటవరసకి కాదు. రాజకీయ పార్టీ చారిటీ కోసం కాదు. రాష్ట్ర ప్రజల సేవ కోసం అధికారం సంపాదించేలా మన రాజకీయాలు ఉండాలి. రాష్ట్రంలో 2024లో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. దానిని బీజేపీ భర్తీ చేయాలి’’ అని పార్టీ కార్యకర్తలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ దిశానిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు మంగళవారం అధికారికంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. దీనికి రామ్‌మాధవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

– సోము వీర్రాజు నాయకత్వంలో నేతలందరూ సమష్టి కృషితో 2024లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేయాలి. 
– ఐదేళ్లో, పదేళ్లో హైదరాబాద్‌లో ఉండి రాజధాని నిర్మాణం చేయాలని అప్పటి ప్రభుత్వానికి సలహా ఇస్తే.. విజయవాడకు పరిగెత్తుకొని వచ్చారు. 
– అమరావతిలో రాజధాని కట్టుకుంటామంటే కేంద్రం వద్దన్నదా? ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకుంటే దాంట్లో కేంద్రం పాత్ర నామమాత్రంగా ఉంటుంది. 
– అయితే మూడు రాజధానులను ఎవరూ ప్రశ్నించకూడదని కాదు. 
– మూడు రాజధానులన్నది అవినీతికి ఆలవాలంగా మారకూడదు.  
– రాజధాని ప్రాంతం రైతులందరికీ న్యాయం జరగాలన్న పోరాటంలో బీజేపీ ముందుండాలి. 

అన్నివర్గాలను కలుపుకొని వెళ్తా..
రాబోయే ఎన్నికల్లో మిత్రపక్ష పార్టీతో కలిసి రాష్ట్రంలో బీజేపీ అధికారం సాధించే దిశగా ప్రయత్నం చేస్తానని సోము వీర్రాజు అన్నారు. కులాలకు అతీతంగా జాతీయ వాదంతో పనిచేసే పార్టీ బీజేపీ అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకొని పనిచేస్తానన్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు తమకు సమదూరమేనని, వారిరువురు శత్రువులు కాదు, మిత్రులు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నేతలు సతీష్‌జీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్, నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా