మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో కంగనా!

22 Sep, 2020 15:21 IST|Sakshi

వడోదర నగరంలో వెలిసిన పోస్టర్లు

అహ్మదాబాద్‌: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతితో పాటు మాదకద్రవ్యాల అంశానికి సంబంధించి బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు హిందీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా సైతం సంచలనం సృష్టిస్తున్నాయి. కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యులు, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ) చీఫ్‌ రామ్‌దాస్‌ అథవాలే కంగనాకు మద్దతుగా నిలిచారు. దీంతో కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో వెలుగుచూసిన ఓ పోస్టర్‌ చర్చనీయాంశమైంది. త్వరలో జరగబోయే వడోదర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో ఆర్‌పీఐ కంగనా ఫొటోలతో ఉన్న పోస్టర్‌ను వాడింది.
(చదవండి: ఎన్ని నోళ్లు మూయించగలరు?)

కాలాఘోడా ప్రాంతంలో వెలిసిన ఈ పోస్టర్‌లో అథవాలే, కంగనా ఉన్నారు. కంగనాకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆర్‌పీఐ వడోదర చీఫ్‌ రాజేశ్‌ గోయల్‌ ఈ సందర్భంగా తెలిపారు. ముంబై వచ్చేందుకు కంగానా ఇబ్బందులు పడుతున్న సమయంలో తమ పార్టీ అధినేత అథవాలే ఆమెకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాగా, యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మరణానికి బంధుప్రీతి కారణమని వార్తల్లో నిలిచిన కంగనా, బాలీవుడ్‌ను డ్రగ్స్‌ మాఫియా శాసిస్తోందని చెప్పి తీవ్ర విమర్శలు చేసింది. దాంతోపాటు సుశాంత్‌ మృతి కేసు విచారణలో ముంబై పోలీసులపై నమ్మకం లేదని తేల్చి చెప్పింది. కంగనా వ్యాఖ్యలపై శివసేన పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో వివాదం ముదిరింది. ఈక్రమంలోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ముంబై కార్పొరేషన్‌ కంగనా కార్యాలయంలో కొంత భాగాన్ని కూల్చేసింది. కక్ష సాధింపు చర్యలు చేపట్టారంటూ ఆమె హైకోర్టుకు వెళ్లడంతో.. అధికారుల దుందుడుకు చర్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
(చదవండి: డ్రగ్స్‌ వాడకం ఫలితమే డిప్రెషన్‌: కంగనా)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా