Karnataka CD Case: సీడీలు విడుదలైతే? ఆ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు!

1 Aug, 2021 10:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి బెంగళూరు(కర్ణాటక): ఎటువంటి ఆరోపణలు లేనివారికే మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్‌ నిర్ణయంతో పలువురు ఎమ్మెల్యేలకు గుబులు పట్టుకుంది. వీరిలో వీడియోల సీడీల నాయకులూ ఉన్నారు. రమేశ్‌ జార్కిహొళి సీడీలు బయటపడినప్పుడు తమ సీడీలు ఏవైనా ఉంటే ప్రసారం చేయరాదంటూ అప్పటి మంత్రులు కొందరు కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకోవడం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అలాగే బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా వేరే వేరే కారణాలతో తమ పరువుకు నష్టం కలిగించే వార్తలు ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు.  

పదవి ఇచ్చాక విడుదలైతే సమస్య.. 
సీడీతో పాటు ఇతరత్రా ఆరోపణలుంటే మంత్రిమండలిలోకి తీసుకోరాదని అధిష్టానం, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు నిర్ణయించినట్లు  తెలిసింది. సదరు ఎమ్మెల్యేలను మంత్రులుగా చేస్తే ఆ తర్వాత వారి సీడీలు ఏవైనా విడుదలయితే అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హైకమాండ్‌ భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే సీడీ భయంతో కోర్టును ఆశ్రయించిన వలస ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే అది సర్కారు మనుగడకు ఇబ్బందికరమేనని చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వలస ఎమ్మెల్యేలు, సీడీల ఆరోపణలున్నవారి భవిత ఉత్కంఠగా తయారైంది.   

మరిన్ని వార్తలు