మేం కాదు, నువ్వే కొత్త బిచ్చగాడివి.. కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌

10 Jul, 2021 11:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మేం కాదు.. నువ్వే కొత్త భిక్షగాడివి. రోజుకో వేషం వేసుకుంటూ, పూటకో అబద్ధం చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. తండ్రీకొడుకులిద్దరూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా కోట్లు కూడబెట్టారు. కాంగ్రెస్‌ నేతలను తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నారు’అని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, సీనియర్‌ నేతలు మల్‌రెడ్డి రాంరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, బండి మధుసూదన్, సిద్ధేశ్వర్, జంగారెడ్డి, ధన్‌రాజ్‌గౌడ్‌లు మాట్లాడారు.

అధికార పార్టీకి అమ్ముడుపోయిన వారికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు. 2023లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలతో పాటు ఇతర నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా ఈనెల 12న రంగారెడ్డి జిల్లా కందుకూరు పట్టణ కేంద్రంలో 4 వేల మంది కార్యకర్తలతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు