గులాబీకి సొంత నేతలే షాక్‌ .. ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే ..!

5 Jul, 2022 13:56 IST|Sakshi

ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్న వైనం 

సాక్షి, రంగారెడ్డిజిల్లా: గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతలే షాక్‌ ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆపరేషన్‌ ఆకర్‌‡్ష మంత్రాన్ని ఆచరించి.. సంఖ్యాబలం లేకున్నా పురపాలికలను చేజిక్కించుకున్న ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గెలిచిన పార్టీలకు ఝలక్‌ ఇస్తూ కారెక్కిన నేతలు.. ఇప్పుడు సొంతగూటి బాట పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం తుక్కుగూడ పురపాలక సంఘం చైర్మన్, తాజాగా బడంగ్‌పేట నగరపాలక సంస్థ మేయర్‌ గులాబీకి గుడ్‌బై చెప్పడం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్మన్‌/మేయర్‌ పదవులను దక్కించుకునేందుకు తగినన్నీ సీట్లు రాకపోవడం టీఆర్‌ఎస్‌ను నిరాశకు గురిచేసింది.

ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి పార్టీల విజేతలకు వల విసరడం ద్వారా మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోగలిగింది. ఈ క్రమంలోనే బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా గెలిచిన మదన్‌మోహన్‌కు తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. అదే తరహాలో బడంగ్‌పేటలో పారిజాత నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలవడమేగాకుండా.. తన మద్దతుదారులను కూడా భారీ సంఖ్యలో గెలిపించగలిగారు. దీంతో ఈ కార్పొరేషన్‌ ప్రత్యర్థుల వశంకాకుండా పావులు కదిపిన మంత్రి సబితారెడ్డి.. కాంగ్రెస్‌ కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడం ద్వారా మేయర్‌ పదవిని పారిజాతకు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

తదనంతర పరిణామాల నేపథ్యంలో వలసనేతలకు గులాబీ అగ్రనేతలతో మనస్పర్థలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ మదన్‌మోహన్‌ కాషాయతీర్థం పుచ్చుకోగా.. తాజాగా బడంగ్‌పేట మేయర్, మరో నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  ఈ పరిణామాలు మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ నేతలను ఆత్మరక్షణలో పడేశాయి. దీనికితోడు మీర్‌పేట నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా కొందరు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఆదిబట్లలోనూ అదే సీను.. 
తుక్కుగూడ, బడంగ్‌పేట పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీలోనూ చోటుచేసుకు న్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నా.. పార్టీని చీల్చి అదే పార్టీకి చెందిన కౌన్సిలర్‌ కొత్త హరితకు చైర్‌పర్సన్‌ గిరిని కట్టబెట్టడం ద్వారా టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఈ పురపాలికను వేసుకోగలిగింది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఏర్పడ్డ అభిప్రాయబేధాలతో హరిత..‘కారు’ దిగి హస్తం గూటికి చేరారు. ఇదిలావుండగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ రాజకీయాలు వేడెక్కాయి. కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌ మధ్య గ్రూపులుగా విడిపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ కూడా పలువురు కౌన్సిలర్లు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు