అవార్డ్‌ వాపసీపై బీజేపీ, టీఎంసీ లడాయి

11 May, 2022 17:34 IST|Sakshi
మమతా బెనర్జీ, రత్న రషీద్ బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ‘అవార్డ్‌ వాపసీ’ బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. టీఎంసీ ఏలుబడిలో స్వోత్కర్ష ఎక్కువైందని బీజేపీ విమర్శించగా.. కమలనాథులు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నాయకులు కౌంటర్‌ ఇచ్చారు.

అసలేం జరిగింది?
బెంగాల్‌కు చెందిన రచయిత్రి, జానపద సంస్కృతి పరిశోధకురాలు రత్న రషీద్ బెనర్జీ.. పశ్చిమబంగ బంగ్లా అకాడమీ 2019లో తనకు ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక ‘అన్నదా శంకర్ స్మారక్ సమ్మాన్’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్య విభాగంలో అవార్డు ప్రదానం చేయడంతో ఆమె ఈ విధంగా తన నిరసన తెలియజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా.. సోమవారం ప్రభుత్వ సమాచార, సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతకు సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఆమె రాసిన 'కబితా బితాన్' పుస్తకానికి గాను సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డును ముఖ్యమంత్రికి అందజేశారు. దీనిపై రషీద్ బెనర్జీ స్పందిస్తూ.. మమతా బెనర్జీ రాసిన పుస్తకంలో సాహిత్యమే లేదని, ఆమెకు అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తన పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. 

అవమానంగా భావిస్తున్నా
‘సీఎంకు సాహిత్య పురస్కారం ఇవ్వడం నన్ను అవమానించినట్లు భావిస్తున్నాను. ఆ నిర్ణయానికి ఇది నా నిరసన. నేను దానిని అంగీకరించలేను. ముఖ్యమంత్రి గారి ‘కబితా బితాన్’ పుస్తకాన్ని నేను సాహిత్యంగా అస్సలు పరిగణించను. ఆమె మన ముఖ్యమంత్రి. మేము ఆమెకు ఓటు వేశాం. నేను వృద్ధురాలిని. నాకు కలం భాష మాత్రమే తెలుసు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆమె మాకు అందనంత ఉన్నత పదవిలో ఉన్నారని తెలుసు. ఇలాంటి ఉదంతాలు ప్రతికూల సంకేతాలు పంపే అవకాశముంద’ని రషీద్ బెనర్జీ పేర్కొన్నారు. 

అధినాయకురాలి దృష్టిలో పడేందుకే..
మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకోవడానికే తృణమూల్‌ నేతలు ఆమె అవార్డు ఇచ్చారని బీజేపీ సీనియర్ బిజెపి నాయకుడు శిశిర్ బజోరియా  ‘ఇండియా టుడే’తో చెప్పారు. రాజకీయ నాయకురాలైన మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుతో కవులు, రచయితలు అసంతృప్తికి గురయ్యారని అన్నారు. ఇందులో భాగంగానే రషీద్ బెనర్జీ తన సాహిత్య పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారని తెలిపారు. తమ అధినాయకురాలి దృష్టిలో పడేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల మధ్య అంతర్గత పోటీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. (క్లిక్: కేజ్రీవాల్‌ కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు)

బీజేపీ నీతులు చెప్పడమా?
అవార్డ్‌ వాపసీ అంశాన్ని తగ్గించి చూపించేందుకు తృణమూల్ కాంగ్రెస్‌ నాయకులు బీజేపీపై ఎదురుదాడికి దిగారు. సాహిత్యం, సంస్కృతి గురించి బీజేపీ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన బీజేపీ తమకు నీతులు చెప్పే అర్హత లేదని వ్యాఖ్యానించారు. (క్లిక్: దేశానికి తదుపరి ప్రధాని అమిత్‌ షా..?)

మరిన్ని వార్తలు