ఇదీ చరిత్ర.. ఇవీ నిజాలు.. ఎన్టీఆర్‌పై ఎవరికెంత ప్రేమ ఉందో బయటపెట్టే నగ్న సత్యాలు

23 Sep, 2022 21:13 IST|Sakshi

ఎన్టీఆర్.. గత మూడు రోజులుగా చంద్రబాబు, ఇప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు వల్లిస్తున్న పేరు. అర్జంట్‌గా ఎన్టీఆర్‌ పేరును తలకెక్కించుకున్న వీరు.. గతంలో ఎన్టీఆర్‌కు ఏం చేశారో తెలియాలంటే కచ్చితంగా వెనక్కి తిరిగి చూడాల్సిందే.

ఎన్టీఆర్‌, చంద్రబాబు.. మామ అల్లుళ్ల సంబంధం. తన కుమార్తెను చంద్రబాబుకు కానుకగా ఇచ్చి ఎన్టీఆర్ పెళ్లి చేస్తే.. చంద్రబాబు తన మామకు వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అందుకే బాబుని ఎన్టీఆర్ దశమ గ్రహంగానూ, ఔరంగజేబుగానూ పోల్చారు. అనుక్షణం చంద్రబాబు అండ్ కో పెట్టిన మానసిక క్షోభతోనే ఎన్టీఆర్ కన్నుమూశారన్నది ఎవరైనా చరిత్ర తెలిసిన వారు చెప్పే విషయం. ఇంత చేసిన తర్వాత కూడా అదే ఎన్టీఆర్‌ను తమ సొంత ప్రాపర్టీగా ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. 

దశమ గ్రహమై ఎన్టీఆర్‌కు విద్రోహం తలపెట్టిన చంద్రబాబు.. ఆయనపై చెప్పులు వేయించి తమాషా చూశారు. పార్టీని చెరబట్టి సైకిల్ గుర్తును సొంతం చేసుకున్నారు. అనుక్షణం మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి చంద్రబాబు నాయుడు అండ్ కోనే కారణమయ్యారన్న విమర్శలున్నాయి. 

తెలుగు సినీ రంగానికి మకుటం లేని మహారాజుగా వెలుగు వెలిగారు నందమూరి తారకరామారావు. అభిమాన ధనుడిగా పేరు గడించిన ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా రాజకీయాల్లోకి వచ్చారు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ కూడా తనదైన శైలితో వెలిగారు ఎన్టీఆర్. ప్రపంచమంతా గౌరవించే ఎన్టీయార్ తన జీవిత చరమాంకంలో చిత్రంగా తన సొంత మనుషులు అనుకున్న వాళ్ల చేతుల్లోనే ఘోరమైన అవమానాలు పొందారు. కంట తడి పెట్టుకున్నారు. గుండెలనిండా మనస్తాపంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఆ క్షోభలోనే అంతిమ శ్వాస విడిచి ఈ లోకానికి గుడ్ బై చెప్పారు.

చదవండి: (అందుకే హెల్త్‌ యూనివర్శిటికీ వైఎస్సార్‌ పేరు.. వాస్తవాలివిగో..)

ఎన్టీఆర్‌ను అవమానించింది ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కాదు. తాను పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి తాను ఇచ్చిన పదవులు అనుభవించి రాజకీయంగా బలిసిన వాళ్లే ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. ఈ మొత్తం విద్రోహానికి అల్లుడు చంద్రబాబు నాయుడే సారధ్యం వహించారు. 1994 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడే వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ట్రాప్‌లో పడేసి తన వెన్నుపోటు ప్రహసనంలో పావులుగా వాడుకున్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుండి తప్పించారు. ఈ తిరుగుబాటులో ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నాయుడి మాయలో పడ్డారని భావించిన ఎన్టీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించడానికి వైస్రాయ్ హోటల్‌కు వెళ్తే చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి దాడి చేశారు.

ఈ ఘోరమైన అవమానాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఎన్టీఆర్ తనకు జరిగిన అవమానంతో కృంగిపోయారు. ఆ క్షణమే తాను చచ్చిపోయినట్లు లెక్క అని కంటతడి పెట్టి ఆక్రోశించారు. ఈ విద్రోహంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా చంద్రబాబు వెన్నంటే ఉండడం అతి పెద్ద విషాదం. తన ఆత్మబంధువులు అనుకున్నవారు.. తాను రాజకీయ భిక్ష పెట్టిన వారు కూడా తనకు ద్రోహం తలపెట్టడాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు.

ఈ బాధలో ఉండగానే ఆయన బ్యాంకు ఖాతాను చంద్రబాబు నాయుడు ఫ్రీజ్ చేయించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ గుర్తు సైకిల్‌ను తన సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ కుర్చీని కబ్జా చేసిన చంద్రబాబు అసెంబ్లీలోనూ ఎన్టీఆర్‌ను అవమానించారు. టీడీఎల్‌పీ నాయకుడినైన తనను బీఏసీ సమావేశాలకు పిలవలేదని ఎన్టీఆర్ మొర పెట్టుకుంటే టిడిపి సభ్యులు ఆహా ఓహో అంటూ వెటకారాలాడి వెక్కిరించి ఎన్టీఆర్‌ను బాధపెట్టారు. ఆయన కంటతడి పెట్టుకుంటే తమాషా చూశారు.

అసెంబ్లీలో తన వాదన వినిపించాలని ప్రయత్నిస్తే ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. తనకు జరిగిన అన్యాయానికి గుండెలు పగిలేలా కుమిలిపోయిన ఎన్టీఆర్ న్యాయం కోసం ఎదురు చూస్తోన్న వేళ   చంద్రబాబు నాయుడు మరో క్షుద్ర క్రీడకు తెరతీశారు. తన వెన్నుపోటుకు అండగా నిలిచిన ఎల్లో మీడియాలో ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించేలా కార్టూన్లు వేయించి పైశాచిక ఆనందం పొందారు.

పార్టీలో దుష్టశక్తులు ఉన్నాయని ఎన్టీఆర్ అంటే ఆ దుష్టశక్తులు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతులే అన్నట్లు ఓ కార్టూనే వేయించారు. ఆయన బట్టలు ఊడదీసినట్లు మరో కార్టూన్ వేయించారు. ఇలా కాకులు పొడిచినట్లు ఎన్టీఆర్‌ను అవమానాలపై అవమానాలు చేస్తూ హింస పెట్టారు. పదవి కోసం తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఔరంగ జేబుతో పోల్చారు ఎన్టీఆర్. జామాతా దశమగ్రహం పేరిట ఓ క్యాసెట్ రిలీజ్ చేశారు. అందులో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఎన్టీఆర్.

ఈ వరుస అవమానాలతో ఎన్టీఆర్ మానసికంగా చితికి పోయారు. అంతులేని బాధను అన్నగారి గుండె తట్టుకోలేకపోయింది. ఆ క్షోభలోనే ఎన్టీఆర్ కన్నుమూశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన ఆనవాళ్లు లేకుండా చేసే చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తి వేశారు. రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎత్తివేశారు. రైతులకు నీటి రాయితీకి గుడ్ బై చెప్పారు. అటు పార్టీలోనూ ఎన్టీఆర్ జ్ఞాపకాలు లేకుండా చెరుపుకుంటూ పోయారు. 

నిజానికి వెన్నుపోటుకు చాలా ముందుగానే స్కెచ్ గీసుకున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఉన్నంత వరకు తాను ముఖ్యమంత్రిని కాలేనని తెలుసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌నే ఆ కుర్చీలోంచి గెంటేయాలని వ్యూహరచన చేశారు. దానికి ఈనాడు అధినేత రామోజీ మద్దతు ఉందని అంటారు. తన రాజకీయ వారసుడిగా తన పెద్ద కొడుకు హరికృష్ణను తీర్చిదిద్దాలని ఎన్టీఆర్ అనుకునేవారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన క్షణం నుంచి ఎన్టీఆర్ చైతన్య రథానికి సారధిగా హరికృష్ణే వ్యవహరించారు. హరికృష్ణను తెలివిగా తప్పించారు చంద్రబాబు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ మేనిఫెస్టోలో ఎన్టీఆర్ ఫోటో లేకుండా జాగ్రత్తలు పడ్డారు ఎన్టీఆర్.

అయితే అదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే మాత్రం అదే ఎన్టీఆర్ బొమ్మలు అవసరం అయ్యేవి. ఏడాదికోసారి జయంతి, వర్ధంతి వచ్చినపుడు మాత్రమే చంద్రబాబు నాయుడు అండ్ కో ఎన్టీఆర్ విగ్రహాలకు ఓ దండ వేసి దండం పెట్టి ఊరుకుంటున్నారు. ఎన్టీఆర్‌నే కాదు ఆయన వర్గీయులుగా ముద్రపడ్డ వారికీ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పదవులు ఇవ్వకపోవడం ద్వారా ఎన్టీఆర్‌పై తనకున్న ద్వేషాన్ని బాహాటంగానే చాటుకున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం ఎన్టీఆర్‌తోనే ఉండిపోయారు. వారు చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదు. అయితే ఎన్టీఆర్ మరణానంతరం మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా అందులో కొందరు తిరిగి టిడిపిలో చేరారు. పార్టీ ఆవిర్బావం నుంచి ఉన్న ఆ నాయకులను చంద్రబాబు తీవ్రంగా అవమానించారు. 

తనకంటే సీనియర్లు అయిన ఎన్టీఆర్ వర్గీయులైన దాడి వీరభద్రరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దు కృష్ణమనాయుడు వంటి నేతలకు తన ప్రభుత్వంలో ఎన్నడూ మంత్రి పదవులు ఇవ్వలేదు చంద్రబాబు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఆలోచనలకు ఆశయాలకు తిలోదకాలిచ్చారు చంద్రబాబు. ఇలా ఎన్టీఆర్‌ను అడుగడుగునా అవమానాలకు గురి చేస్తూ అనుక్షణం క్షోభ పెడుతూ మోసపూరిత కుట్రలతో మనస్తాపానికి గురి చేసిన చంద్రబాబు నాయుడు అండ్ కో ఇపుడు ఎన్టీఆర్ మా వాడే అంటూ నాటకాలాడే ప్రయత్నం చేస్తోంటే జనం ఫక్కున నవ్వుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ను ఇప్పటికీ ద్వేషిస్తూనే వస్తున్నారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ పేరుతో ఉన్న పథకం పేరును మార్చేస్తానని ఆంధ్రజ్యోతి ఎండీతో చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు బహిర్గతం కావడంతో అన్నగారి అభిమానులే కాదు తెలుగు ప్రజలంతా బాబు అండ్ ఎల్లోమీడియాలపై ఖాండ్రించి ఉమ్మేసినంత పని చేశారు.

జీవించి ఉన్నంత కాలం ఎన్టీఆర్‌ను క్షోభపెడుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత కూడా ఆయన్ను వదిలిపెట్టకుండా అవమానిస్తున్నారని పాతతరం టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు విషయంలోనూ ఇదే తీరు. తాను తీసుకురాకపోవడం ఒక ఎత్తయితే అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడానికి కేంద్రం అంతా సిద్దం చేస్తూ ఉండగా చివరి నిమిషంలో ఆ అవార్డు ఎన్టీఆర్‌కు రాకుండా ఆగిపోయింది. అది ఎవరి కుట్ర వల్ల జరిగిందా అని ఆరా తీస్తే చంద్రబాబు నాయుడే ఆ అవార్డు ఎన్టీఆర్‌కు ఇవ్వద్దని వాజ్ పేయ్‌పై ఒత్తిడి తెచ్చారని తేలింది.

మరిన్ని వార్తలు