ఆ విషయంపై కొణతాల ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు?

9 Jan, 2023 20:31 IST|Sakshi

ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక పేరుతో జరిగిన ఒక కార్యక్రమం భవిష్యత్తు రాజకీయ దృశ్యం ఇలా ఉండే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. పేరుకు చర్చా వేదిక కాని, పాల్గొన్నవారిలో అత్యధికులు రాజకీయ పార్టీలవారే. అది కూడా తప్పు కాదు. కాని వారంతా అమరావతి 29 గ్రామాల ప్రాంతం మాత్రమే అభివృద్ది చెందాలని కోరుకుంటున్న వారు కావడం విశేషం. రాజకీయాలకు దూరంగా ఉంటూ, అప్పుడప్పుడో, లేక ఎన్నికలప్పుడో తళుకుమంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దీనికి నాయకత్వం వహించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆయన చాలా ఆందోళన చెందారు. మంచిదే. కాకపోతే ఎన్నికల సంవత్సరంలోనే కాకుండా, నిరంతరం దీనిపై ప్రజలలో ఆయన ఉన్నట్లయితే ఒక నమ్మకం ఏర్పడేది. అంతేకాదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు దూరం అయిన కొంత కాలం మౌనంగా ఉండి, సడన్‌గా 2019 ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ వెనుక నిలబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉంటే గౌరవంగా  ఉండేది.

ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడుగా పేరొందిన రామకృష్ణ మంత్రిగానే కాకుండా, ఎంపీగా కూడా పనిచేశారు. అప్పట్లో ఉత్తరాంధ్రలో ఎంత మేరకు అభివృద్ది జరిగింది, అందులో ఆయన భాగస్వామ్యం ఏమిటి? ఆ తర్వాత ఎప్పటి నుంచి అభివృద్ది ఆగిపోయింది? దానికి కారణాలు ఏమిటి? అన్న కోణంలో ఆయన చెప్పినట్లు అనిపించలేదు.

కేవలం ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం, వలసలు, ఉద్దానంలో కిడ్నీ సమస్యలు, ప్రాజెక్టులు తదితర అంశాలకే పరిమితం అయ్యారు. అంతే తప్ప కీలకమైన అమరావతి అంశాన్ని విస్మరించినట్లుగా ఉంది. పత్రికలలో వచ్చిన వార్తలు చూస్తే అలా అనిపించింది. ఒకవేళ ఆయన అమరావతి మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర కూడా అభివృద్ది చెందాలని చెప్పి ఉంటే మంచిదే. తెలుగుదేశం హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ది మోడల్ అంతా అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ లాగే సాగిందన్న విమర్శ కొత్తది కాదు.

దానివల్లే ఆయన పార్టీ పరాజయం చెందింది. అమరావతి రాజధాని పేరుతో హైకోర్టుతో సహా నవ నగరాలు అన్నీ అక్కడే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాని దానిని జనం వ్యతిరేకించారు. మరి ఈ విషయంలో కొణతాల ఏమి చెబుతున్నారో తెలియదు. ఇప్పుడు కూడా ఆయన తెలుగుదేశంకు మద్దతు ఇస్తున్నట్లయితే, విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని అనుకుంటున్నట్లే అవుతుంది. దీనిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు. విశాఖలో రిషికొండ తదితర ప్రాంతాలలో అభివృద్ది పనులు జరుగుతుంటే అడ్డుపడుతున్న టీడీపీ, జనసేనలతో కలిసి ఆయన ఉత్తరాంధ్రపై చర్చించడం అంటేనే రాజకీయ లక్ష్యం అర్దం అవుతుంది.

అన్నిటికి మించి తెలుగుదేశం మీడియా ఈ వేదికకు విస్తారంగా కవరేజీ ఇచ్చిందంటేనే చర్చలో పాల్గొన్న వారిలో అత్యధికులు ఎటువైపు ఉన్నారో తెలిసిపోతుంది. నిజానికి ఈ రాష్ట్రాన్ని ఏలిందే కాంగ్రెస్, టీడీపీలు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయింది. మరి ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకుబాటు తనానికి ఎవరిని తప్పుపడతారు? ముందుగా తమను తాము విమర్శించుకుని, అప్పుడు ఏమైనా మాట్లాడి ఉండాలి.  విద్యావేత్తలు కె.ఎస్.చలం వంటి కొద్ది మినహా మిగిలిన వారంతా రాజకీయవేత్తలే. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్  జనసేన పక్షాన ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆయన విశాఖ రాజధాని అవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

విశాఖ రాజధాని అయితే, అక్కడ పలు అభివృద్ది పనులకు ఆస్కారం ఉంటుంది. ఉత్తరాంధ్ర వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆయన ఏదో గిరిజన డిక్లరేషన్ అనో, మరొకటనో చెబుతున్నారు తప్ప, విశాఖ రాజధాని గురించి మాట్లాడినట్లు లేరు. పైగా విశాఖ రాజధానిగా అవసరం లేదని ప్రచారం చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్దిపై గోష్టికి హాజరవడం గడుసుదనమేనేమో! టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు యథా ప్రకారం నోటికి వచ్చిన ఆరోపణలు చేశారు. స్వయంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేతలే భూ ఆక్రమణలకు పాల్పడ్డారని సిట్ ముందు చెప్పారు కదా? దాని గురించి కూడా ప్రస్తావించి ఉండవచ్చు.

సీపీఐ రామకృష్ణ తెలుగుదేశం ఏమి చెబితే అదే అంటుంటారని అంటారు. ఆయన కూడా అమరావతి రాజధానిలోనే అన్ని వ్యవస్థలు, సంస్థలు కోరుకునే వ్యక్తి అని భావిస్తారు. ఆయన వచ్చి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు. పైగా ఉత్తరాంధ్రకు పరిశ్రమలు రావని శాపనార్ధాలు పెడుతున్నారు. ఒకసారి అచ్యుతాపురం పారిశ్రామికవాడకు వెళ్లి ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా? రావడం లేదా అని తెలుసుకుంటే మంచిది కదా. ఏదో రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు చేయడం కాకుండా అభివృద్దికి సరైన సూచనలు చేయడం వీరు మానేశారు.

ఈ మధ్య కాలంలో సీపీఎం కూడా వీరితో శృతి కలుపుతున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం కాంగ్రెస్ చాలా చేసిందని చెబుతున్నారు. మరి అసలు ఏమి అభివృద్ది జరగలేదన్నట్లుగా మాట్లాడుతున్న వారితో కలిసి చేతులు ఎందుకు ఎత్తినట్లు? సీపీఐ, సీపీఎంలు కేంద్రంలోని బీజేపీని విమర్శించడానికే ఈ సదస్సును సహజంగానే వాడుకుంటాయి. సీపీఐ రామకృష్ణ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఆచరణాత్మకంగా వీరు మాట్లాడినట్లు కాకుండా, రాజకీయ లక్ష్యంతో ప్రసంగాలు చేసినట్లు అర్దం అవుతుంది.

ఇక లోక్‌స్తతా అధినేత జయప్రకాశ్ నారాయణ ఎక్కువ భాగం జనరల్‌గా మాట్లాడినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఆయనకు వామపక్ష కార్మిక సంఘాల నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో నిరసన ఎదురైంది. అయినా ఆయన తన వైఖరికే కట్టుబడి ఉన్నట్లు ఉన్నారు. అందువల్ల వారికి సమాధానం ఇవ్వలేదు. ఇది సరైన వేదిక కాదని ఆయన చెప్పారు. జేపీ వాదనతో వామపక్షాలు ఏకీభవించడం లేదు. అది వేరే విషయం. నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి చర్చించాలంటే బీజేపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్ లకు కూడా అవకాశం ఇచ్చి ఉండాల్సింది.

వారి వాదన ఏమిటో కూడా తెలుసుకోవాలి కదా ఆ పని చేయకుండా ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి కనుక, వచ్చేది ఎన్నికల సంవత్సరం కనుక ఇప్పటి నుంచే వ్యతిరేక ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ ముసుగులో ఈ వేదికను వాడుకున్నట్లు అనిపిస్తుంది. అయితే టీడీపీ, జనసేన నేతలు బీజేపీని విమర్శించలేరు. వైసీపీపైనే విమర్శలు చేస్తుంటారు.

బీజేపీతో పొత్తు కోసం టీడీపీ నానా పాట్లు పడుతోంది. కాని బీజేపీ ఇంత వరకు సుముఖత కనబరచలేదు. అదే ప్రకారం రాజకీయం ఉంటే వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన( బీజేపీని వదలిపెడితే), వామపక్షాలు కలిసి పోటీచేయవచ్చు. జేపీ లోక్‌సత్తాకు ఒకటో, అరో సీట్లు ఇచ్చి కలుపుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కొత్త రాజకీయ సమీకరణగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ వేదికపై కాంగ్రెస్ పార్టీ ఉన్నా వారిని కలుపుకోవడం కష్టం కావచ్చు.  అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే వామపక్షాలు దూరం అవుతాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో తన విజయావకాశాలు పెంచుకోవడం కోసం తెలుగుదేశం అనుసరిస్తున్న వ్యూహాలలో ఇది కూడా ఒకటి కావచ్చు. నిజానికి రాష్ట్రాన్ని ఏలిందే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు వైసీపీ అధికారంలోకి వచ్చిందే మూడేళ్ల క్రితం. మరి ఈ ప్రాంత వెనుకబాటుతనానికి ఎవరిని తప్పుపట్టాలి? ముందుగా ఆ సంగతి కూడా చర్చించగలిగి ఉంటే బాగుండేది. ఈ ఏడాదంతా ఇలాంటి రాజకీయ విన్యాసాలు ఇంకా చాలా చూడాల్సిందే.
-హితైషి

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు