ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి

26 Jul, 2021 04:09 IST|Sakshi

శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌

న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేలా వివిధ ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రాంతీయ పక్షాలన్నీ కలిసి బలీయమైన నేషనల్‌ ఫ్రంట్‌గా ఏర్పడుతాయని విశ్వాసముందన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయి పార్టీ కాబోదన్నారు. తాము ఏర్పాటు చేయబోయే నేషనల్‌ ఫ్రంటే బీజేపీని ఎదుర్కొంటుందని తెలిపారు. బీజేపీతో తమ పార్టీ మైత్రీ బంధం కథ ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు.

మాయావతికి చెందిన బహుజన సమాజ్‌ పార్టీతో తమ పొత్తు శాశ్వతమన్నారు. రైతులకు సంబంధించిన అంశాలే తమ పార్టీ మేనిఫెస్టోలో కీలకమని, ఈ విషయంలో రాజీకి తావులేదన్నారు. అందుకే, వ్యవసాయ చట్టాలపై కేంద్రం తీరుకు నిరసనగా దశాబ్దాల నాటి బీజేపీ మైత్రీ బంధాన్ని సైతం తెంచుకుని, ప్రభుత్వం నుంచి వైదొలిగినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్‌లో అమలు కానీయ బోమన్నారు. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బాదల్‌ భార్య హర్‌సిమ్రత్‌ కౌర్‌ సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు