ముందు షారుక్‌ను తీసేసి గంగూలీని పెట్టు.. మమతకు బీజేపీ కౌంటర్‌

17 Oct, 2022 18:38 IST|Sakshi

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి సౌరవ్ గంగూలీని తప్పించడం తనను షాక్‌కు గురి చేసిందని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలని, గంగూలీని ఐసీసీకి పంపాలని ఆమె కోరారు. అయితే మమత వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. గంగూలీ గొప్పతనం గురించి నిజంగా ఆమెకు తెలిస్తే.. బెంగాల్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా షారుక్‌ ఖాన్‌ను తప్పించాలని, ఆ స్థానాన్ని దాదాతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాతే మమత మాట్లాడాలని తెలిపింది. బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈమేరకు వ్యాఖ్యానించారు.

అంతేకాదు క్రీడలపై రాజకీయం చేయొద్దని మమతకు సూచించారు సువేందు అధికారి. ఇలాంటి విషయాలకు ప్రధాని మోదీ చాలా దూరంగా ఉంటారని, ఆయన ప్రస్తావన తీసుకురావద్దని హితవు పలికారు. క్రికెట్ వ్యవహారాల్లో ప్రధాని జోక్యం చేసుకోరని మమతకు ఆ మాత్రం తెలియదా? అని సెటైర్లు వేశారు.

అంతకుముందు గుంగూలీకి మద్దతుగా మాట్లాడారు మమతా బెనర్జీ. ఆయన ఏం తప్పు చేశారని బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి తప్పించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అయినా జోక్యం చేసుకుని గంగూలీని ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమిత్‌ షా కుమారుడు జైషాను మాత్రం రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించడాన్ని ప్రశ్నించారు.
చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్‌’

మరిన్ని వార్తలు