‘నా నవ్వును శూర్పణఖ నవ్వుతో పోల్చారు.. ప్రధాని మోదీపై పరువునష్టం కేసు వేస్తా’

24 Mar, 2023 11:30 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పరువు నష్టం కేసు వేస్తానని కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తెలిపారు. 2018లో పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ విషయంపై తాను నవ్వానని, మోదీ తన నవ్వును శూర్పణఖ నవ్వుతో పోల్చారని ఆమె పేర్కొన్నారు. సభలో అందరిముందు అవమానిస్తూ మోదీ మాట్లాడిన మాటలు తనను బాధించాయని, అందుకు మోదీపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు.

ఇప్పుడు కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చుద్దాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈమేరకు మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించిన వీడియోను ఆమె ట్వీట్‌ చేశారు. ఇందులో.. రామాయణం సీరియల్ ప్రసారం అయిన కొన్ని రోజుల తర్వాత అలాంటి నవ్వు వినిపించినందున రేణుకా చౌదరి నవ్వును కొనసాగించడానికి అనుమతించాలని నరేంద్ర మోడీ రాజ్యసభ ఛైర్మన్‌ను కోరినట్లు కనిపిస్తుంది. 

కాగా ‘దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద రాహుల్‌ను దోషిగా నిర్ధారించిన చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హెచ్‌.హెచ్‌.వర్మ.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన అనంతరం బెయిల్‌ మంజూరు చేశారు. ఈ ఆదేశాలపై కోర్టులో అప్పీలుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. 

రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు శిక్ష విధించడాన్ని విపక్షాలన్నీ ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ తనను శూర్పణఖతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళతానని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ విషయంలో కోర్టులు చాలా వేగంగా స్పందించాయని చెబుతూ.. ఈ కేసు విచారణను ఎంత వేగంగా పూర్తి చేస్తాయో చూడాలని ఆమె అన్నారు.
చదవండి: ‘దొంగల ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై... రాహుల్‌కు రెండేళ్ల జైలు

మరిన్ని వార్తలు