ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్‌

31 Mar, 2022 14:58 IST|Sakshi

పదవీ కాలం ముగిసిన రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు

న్యూఢిల్లీ: పదవీ కాలం ముగిసిన 72 మంది సభ్యులకు రాజ్యసభ గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికింది. రిటైర్‌ అవుతున్న సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఫొటో సెషన్‌లో ఉన్నారు.

ఈ సభ ఎంతో ఇచ్చింది: మోదీ
పదవీ విరమణ చేసిన సభ్యులు మాట్లాడేందుకు వీలుగా రాజ్యసభలో ఈరోజు జీరో అవర్‌, ప్రశ్నోత్తరాలను వెంకయ్య నాయుడు రద్దు చేశారు. రిటైర్‌ అయిన సభ్యులు మళ్లీ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మన రాజ్యసభ సభ్యులకు అపార అనుభవం ఉంది. కొన్నిసార్లు అకడమిక్ నాలెడ్జ్ కంటే అనుభవానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ పార్లమెంట్‌లో చాలా కాలం గడిపాం. మనం ఇచ్చిన దాని కంటే ఎంతో ఎక్కువ ఈ సభ మనకు ఇచ్చింది. ఇక్కడ గడించిన అనుభవాన్ని దేశంలోని నాలుగు దిశలకు తీసుకెళ్లాల’ని మోదీ అన్నారు. 

ఆంటోనీ, స్వామి, గుప్తా..
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఏకే ఆంటోనీ, ఆనంద్‌ శర్మ.. బీజేపీ నేతలు సుబ్రమణ్యస్వామి, స్వపన్ దాస్‌గుప్తాలతో సహా మొత్తం 72 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది. నిర్మలా సీతారామన్ జూన్‌లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనుండగా.. పియూష్‌ గోయల్, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. కాంగ్రెస్ నాయకులు పి చిదంబరం, కపిల్ సిబల్.. శివసేన నేత సంజయ్ రౌత్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రఫుల్ పటేల్ కూడా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. (క్లిక్: అఖిలేష్‌కు బీజేపీ చెక్‌.. రాజ్యసభకు శివపాల్‌?)

ఎంపీలకు వెంకయ్య విందు
వెంకయ్య నాయుడు తన నివాసంలో రాజ్యసభ సభ్యులందరికీ ఈ రాత్రి విందు ఇవ్వనున్నట్లు అధికారిక వర్గాలు ‘పీటీఐ’కి వెల్లడించాయి. పదవీ విరమణ చేస్తున్న 72 మంది సభ్యులకు, ఇంతకు ముందు పదవీ విరమణ చేసిన మరో 19 మందికి జ్ఞాపికలను వెంకయ్య నాయుడు అందజేస్తారు. ఈ విందులో ఆరుగురు ఎంపీలు తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శిస్తారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. (క్లిక్: థ్యాంక్యూ మోదీ జీ: కేటీఆర్‌ సెటైర్లు)

మరిన్ని వార్తలు