బిహార్‌ ముఠా రాష్ట్రాన్ని ఏలుతోంది

1 Mar, 2022 04:25 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

మీకు తెలంగాణ ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు కన్పించడం లేదా? 

తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ను కూడా తెచ్చుకున్నారు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ 

సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రాన్ని బిహార్‌ ముఠా ఏలుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. బిహారీల పాలనతో రాష్ట్రం దివాళా తీసిందని అన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసి కల్యాణ మండపంలో పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షలో రేవంత్‌ ప్రసంగించారు. ప్రభుత్వ కీలక పదవుల్లో బిహారీలైన సోమేశ్‌కుమార్, అంజనీకుమార్, అరవింద్‌కుమార్, సందీప్‌కుమార్‌లను కూర్చోబెట్టారని.. తాజాగా ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రశాంత్‌ కిషోర్‌ను బిహార్‌నుంచి తెచ్చుకున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్‌ పూర్వీకులు కూడా బిహార్‌ వాళ్లేనని రేవంత్‌ అన్నారు. ‘మీకు తెలంగాణ ప్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌లు కనిపించడంలేదా? కేవలం బిహార్, ఎంపీ వాళ్లే కనిపిస్తున్నారా?’అని ప్రశ్నిం చారు. పాలమూరు బిడ్డ ప్రవీణ్‌కుమార్, ఐఏఎస్‌ మురళి కేసీఆర్‌ పాలన నచ్చక ధైర్యంగా రాజీనామా చేసి బయటికొచ్చారని చెప్పారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి రాజీనామా చేసి బయటికి రావాలన్నారు. 12 నెలల్లో కాంగ్రెస్‌ సర్కార్‌ వస్తుందని అన్నారు.  

దేశంలోనే నం.1గా నల్లగొండ  
పార్టీ సభ్యత్వ నమోదు (4.30 లక్షలు)లో నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రేవంత్‌రెడ్డి అభినందించారు. అతి తక్కువ నమోదు సికింద్రాబాద్‌లో ఉందన్నారు. ప్రతి బూత్‌లో కనీసం వంద సభ్యత్వాలు నమోదు చేయించనివారి పదవులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 25 వరకు సభ్యత్వాలను నమోదు చేయాలని, కష్టపడ్డవారికి కాంగ్రెస్‌లో అవకాశాలు వస్తాయని చెప్పారు.  

మరిన్ని వార్తలు