డీజీపీ, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌..

25 Oct, 2021 02:18 IST|Sakshi

మీడియా చిట్‌చాట్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణ

సామాజికవర్గం ఆధారంగా డీజీపీని అనుమానిస్తున్నారని వ్యాఖ్య

కరీంనగర్‌ పోలీసు అధికారులతోనే నిఘా..   

రిటైర్డ్‌ ఐపీఎస్‌ నేతృత్వంలోప్రత్యేక సెల్‌ ఏర్పాటు

బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడుదొంగల పార్టీలు.. పంపకాల్లో తేడాలతోనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక

వరద సాయం 10 వేలివ్వనివారు, రూ.10 లక్షలు ఏమిస్తారు?

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా ట్యాప్‌ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజికవర్గం ఆధారంగా డీజీపీని అనుమానిస్తున్నారని, ఇది తగదని అన్నా రు. పోలీసుల్లో ఒకే విభాగానికి ప్రభుత్వపెద్దలు పెద్దపీట వేస్తున్నారని, పోలీసు శాఖ రెండు వర్గాలుగా చీలిపోయిందని వ్యాఖ్యానించారు.

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులుగా పేరొందిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌రావు, నర్సింగరావు, ప్రవీణ్‌రావు, రమణకుమార్‌లతో కూడిన 30 మంది బృందంతో రాజకీయ నేతలపై ఆధునిక సాంకేతికతతో నిఘా పెట్టారని, దీని కోసం ఓ విశ్రాంత ఐపీఎస్‌ నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవర్గానికి చెందిన ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా తమవర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ మేరకు ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి గజానన్‌ని డిప్యుటేషన్‌ మీద తీసుకువచ్చారని ఆరోపించారు. తనకు అనుకూలమైన అధికారులకు హైదరాబాద్‌లో పోస్టింగులు ఇప్పించుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.

వాటాల పంచాయితీతోనే ఉపఎన్నిక
ఇరవై ఏళ్లు మంత్రి హరీశ్‌రావుతో సహవాసం చేసిన ఈటల రాజేందర్‌ అకస్మాత్తుగా దొంగ ఎలా అయ్యారని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ చైర్మన్‌గా ఉన్న టీఆర్‌ఎస్‌ అనే కంపెనీలో వాటా అడుగుతున్నాడన్న అక్కసుతోనే రాజేందర్‌ను డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ము పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాలే ఈటల రాజీనామాకు దారితీశాయని, అందుకే హుజూరాబాద్‌ ఉపఎన్నిక వచ్చిందని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ తోడుదొంగలేనని విమర్శించారు.

ఏడేళ్లలో ప్రధాని గ్యాస్, పెట్రో, నిత్యావసరాల ధరలు పెంచడం తప్ప ఇంకేమీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్‌ నయా నిజాం అని, తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అల్లుడు హరీశ్‌రావు అనే ఖాసీం రిజ్వీని దింపారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీలో కేసీఆర్‌ బీజేపీ, నడ్డా బీజేపీ అని రెండు విభాగాలు ఉన్నాయని, బండి సంజయ్‌ ఆటలో అరటి పండు అని వ్యాఖ్యానించారు. అందుకే మురళీధర్‌ రావు, సుగుణాకర్‌రావు, విద్యాసాగర్‌రావులు బండి సంజయ్‌ని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
 
2022లో ముందస్తు ఎన్నికలకు..
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత టీఆర్‌ఎస్‌లో ముసలం పుడుతుందని రేవంత్‌ జోస్యం చెప్పారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు 2022 డిసెంబర్‌లో కేసీఆర్‌ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు సూసైడ్‌ టెండెన్సీ ఉందని, ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెదరగొట్టడం ఆయనకు అలవాటేనని అన్నారు. ఇందుకు 2004 నుంచి 2018 వరకు తన పార్టీ ప్రజాప్రతినిధులు, ఆయన చేసిన రాజీనామాలు, ముందస్తు ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. దళితబంధు కోసం ఇప్పుడు కేటాయించిన రూ.రెండు వేల కోట్లనే విడుదల చేయలేదని,మాటలతో మభ్యపెట్టే కేసీఆర్‌ను 2022 ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడిస్తారని, ఆ దెబ్బకు కేసీఆర్‌ ఆత్మహత్య చేసుకుంటారని అన్నారు. హైదరాబాద్‌లో వరద సాయం కోసం రూ.10 వేలే సరిగా ఇవ్వనివారు, దళితబంధు కింద లక్షలాది మందికి రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 
 

మరిన్ని వార్తలు