ఎన్నికలు రాగానే దళిత బంధు తెచ్చారు

1 Aug, 2021 01:16 IST|Sakshi

కేసీఆర్‌ ఎప్పుడైనా దళిత, గిరిజనులతో మీటింగ్‌ పెట్టి ఏమి చేద్దామని అడిగారా? 

పోడుభూముల పోరాట కమిటీ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి  

కేసీఆర్‌ మోసం చేస్తున్నారు: భట్టి  

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఎన్నికలు రాగానే దళిత బంధు అంటూ సీఎం కేసీఆర్‌ కొత్త పథకాన్ని తెచ్చారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏడేళ్లలో కేసీఆర్‌ ఎప్పుడైనా దళిత, గిరిజన నేతలతో సమావేశం పెట్టి ఏమి చేద్దాం అని అడిగారా అని ఆయన నిలదీశారు. దళిత బంధు అమలు చేస్తా.. ఎవడు ఆపుతాడో చూస్తా అన్న సీఎం ఈ పథకాన్ని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఇందిరాభవన్‌లో జరిగిన పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దళిత, గిరిజనులకు కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ప్రగతి భవన్‌ అమ్ముతావో, సెక్రటేరియట్‌ అమ్ముతావో చెబితే తాము మద్దతు ఇస్తామని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని గూడేలు తిరుగుతామని, ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దండు కట్టి దండోరా వేస్తామన్నారు.

దళిత దండు కార్యక్రమంలో తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని,  కాంగ్రెస్‌ కార్యకర్తలు మండలాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకుల గుండెల్లో చావు డప్పులు మోగాలన్నారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. కేసీఆర్‌ దళిత గిరిజనులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన చట్టాలను అమలయ్యేలా మళ్లీ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గిరిజనులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని, ఆదిలాబాద్‌ నుండి ఖమ్మం జిల్లా వరకు పోడు భూములపై పోరాటం చేస్తామన్నారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని, హరితహారం పేరుతో కేసీఆర్‌ గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో ఉద్యోగాలు, చదువులు లేవని ధ్వజమెత్తారు. రైతు బంధు, దళిత బంధులు ఎన్నికల హామీలేనని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ఎస్టీ సెల్‌ అధ్యక్షులు జగన్‌ లాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు