బీజేపీ చేతిలో కేసీఆర్‌ కీలుబొమ్మ 

16 Jun, 2022 01:36 IST|Sakshi

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కేసీఆర్‌కు సుపారీ: రేవంత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ చేతిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలుబొమ్మని టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి కోసం ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరు కావాలని కేసీఆర్‌ ముందే నిర్ణయించుకున్నారన్నారు.

గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ నేతలు వీహెచ్, అంజన్‌కుమార్‌యాదవ్, రాములు నాయక్, శివసేనారెడ్డి, చిన్నారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. మోదీ ఆడించినట్టు ఆడటమే కేసీఆర్‌ విధి అని వ్యా ఖ్యానించారు. మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి వెళ్లని కేసీఆర్, తాను ఏర్పాటు చేసిన ‘బిహార్‌ రాష్ట్ర సమితి’పార్టీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా అని ప్రశ్నించారు.

రాజ్‌భవన్‌ ముట్టడి నేడు: ఈడీ విచారణ పేరుతో సోనియా, రాహుల్‌గాంధీలపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ అరాచకాలకు నిరసనగా గురు, శుక్రవారాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించారు.

ఏఐసీసీ కార్యాలయంలోకి దూసుకెళ్లి మరీ అక్కడి నేతలను కొట్టడం హేయమైన చర్యన్నారు. ఇందుకు నిరసనగా గురువారం రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలిపారు. శుక్రవారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాలని రేవంత్‌ పిలుపునిచ్చారు.   

మరిన్ని వార్తలు