కాంగ్రెస్‌ జెండా ఎగిరితేనే రైతులకు న్యాయం

28 Jun, 2022 01:37 IST|Sakshi
సత్యాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

ఖమ్మం ఖిలా కాంగ్రెస్‌దే.. జనం మనవెంటే: రేవంత్‌రెడ్డి 

ఖమ్మం మాజీ కార్పొరేటర్‌ రాంమూర్తి, మాజీ జెడ్పీటీసీ భారతి ఆధ్వర్యంలో భారీగా చేరికలు 

సాక్షి, హైదరాబాద్‌/మల్కాజిగిరి: శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ మేరకు రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కార్పొరేటర్‌ రాంమూర్తి నాయక్, మాజీ జెడ్పీటీసీ భారతి తదితరుల ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌లో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు, కౌలు రైతులకు సైతం ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గిట్టుబాటు ధర అడిగితే మిర్చి రైతులకు బేడీలు వేశారని ధ్వజమెత్తారు. రైతులకు అన్యాయం జరిగితే తిరగబడ్డ ప్రాంతం ఖమ్మం అని, ఈ జిల్లాలో 22 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఆ కుటుంబాలను కనీసం పరామర్శించలేదని అన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్‌ మీద పోరాటం చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టారని, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే, మంత్రిని బర్తరఫ్‌ చేయాల్సిందిపోయి దగ్గరకు తీసుకున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో 10కి 9 స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని, గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా, ప్రజలు కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని చెప్పారు. ఖమ్మం ఖిలా కాంగ్రెస్‌దేనన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ తదితరులు హాజరయ్యారు.  

అగ్నిపథ్‌పై కేసీఆర్‌ వైఖరేంటి? 
అగ్నిపథ్‌పై మోదీ నిర్ణయం దేశ భద్రతకే ముప్పుగా పరిణమించిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అగ్నిపథ్‌పై పార్లమెంట్‌లో అభిప్రాయసేకరణ చేయకుండా మోదీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ ఆధ్వర్యంలో సోమవారం మల్కాజిగిరి చౌరస్తాలో జరిగిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్‌ మాట్లాడారు.

ఈడీ కేసులకు భయపడబోమని, దేశంలో ఈడీ.. బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌మెంట్‌గా పనిచేస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అగ్నిపథ్‌పై వైఖరి వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా నిరసన తెలపాలన్నారు. 

మరిన్ని వార్తలు