తర్వాతి అడుగు కేసీఆర్‌ నెత్తి మీదే..

19 Aug, 2021 01:29 IST|Sakshi
బుధవారం రావిర్యాలలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాణిక్యం ఠాగూర్, శ్రీనివాస కృష్ణన్, చిన్నారెడ్డి

ఇంద్రవెల్లిలో తొలి అడుగు వేసినం.. టీఆర్‌ఎస్‌ను పాతాళంలోకి నెడతం: రేవంత్‌రెడ్డి 

ఉద్యమంలో అమరులైనది ఎవరు?.. తెలంగాణ వచ్చినంక దోచుకుంటున్నది ఎవరు? 

కేసీఆర్‌ కుటుంబానికి పదవులు వచ్చాయి.. అమరవీరుల కుటుంబాలకు ఏం వచ్చింది? 

కేటీఆర్‌ నమ్మకద్రోహం చేసి ఎమ్మెల్యే అయ్యారు 

దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలు 

ఫార్మాసిటీ బాధితులకు అండగా ఉంటాం.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో 20 వేల ఎకరాల భూమిని సేకరించింది. దళితుల అసైన్డ్‌ భూములను గుంజుకుంది. ఎకరం రూ.2 కోట్లు పలుకుతున్న ఇక్కడి భూములను రూ. 8 లక్షలు చేతిలో పెట్టి లాక్కుంది. ఇదేమని ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపుతున్నారు. ఫార్మాసిటీ బాధితులకు మేం అండగా ఉంటాం.

కాంగ్రెస్‌పైనే జనం ఆశలు.. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ వైపు ఆశగా, అభిమానంగా చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకే నాలుగు కోట్ల ప్రజల ఆవేదన, ఆలోచన తెలుసు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం కాంగ్రెస్‌తోనే సాధ్యం.  

సాక్షి, హైదరాబాద్‌: ‘‘వీరులగడ్డ, విప్లవాల నేల ఇంద్రవెల్లిలో తొలి అడుగు వేసినం. మలి అడుగు మహేశ్వరంలో పెట్టినం. ఇక ఒకే ఒక్క అడుగు ఉంది. అది కేసీఆర్‌ నెత్తిమీదనే పెడతం. కాంగ్రెస్‌ కార్యకర్తలు కదం తొక్కి కేసీఆర్‌ నెత్తి మీద పెట్టే అడుగుతో టీఆర్‌ఎస్‌ పార్టీని పాతాళంలోకి నెడతం..’’అని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల వారు దోపిడీకి గురయ్యారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది ఎవరో, రాష్ట్రం వచ్చాక పదవులు అనుభవిస్తూ సంపదను దోచుకుంటున్నది ఎవరో గమనించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ శివార్లలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో బుధవారం నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సభలో రేవంత్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

వేల కోట్లకు భూములు అమ్మి.. 
‘‘తాతలు, ముత్తాతల నాటి నుంచి కాపాడుకున్న భూములను వేల కోట్ల రూపాయలకు తెగనమ్మి.. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని కేసీఆర్‌ అంటున్నారు. ఆ పది లక్షలతో కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో గుంట భూమి ఇస్తారా.. ఆయన కుమారుడు కేటీఆర్‌ కట్టుకున్న జనవాడ ఫాంహౌజ్‌లో భూమి ఇస్తారా? దళిత, గిరిజనులు అడుగుతున్నది సంక్షేమ పథకాలు కాదు.. వారి బిడ్డలకు విద్య, ఉద్యోగాలు, ఉపాధి. కేసీఆర్‌ ఎంగిలి మెతుకులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఆశపడ్తారేమోగానీ దళిత, గిరిజనులు కాదు. 

ఆ మూడే అడుగుతున్నా 
తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం.. ఈ మూడే అడుగుతున్నారు. కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో ఏ ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగం రాలేదు. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రాలేదు. కేసీఆర్‌ మాత్రం సీఎం అయ్యారు. ఆయన కుమారుడు, అల్లుడు మంత్రులు, బిడ్డ ఎమ్మెల్సీ అయ్యారు. సడ్డకుడి కుమారుడు ఎంపీ అయ్యాడు. టీవీ, పేపర్, ఫాంహౌజ్‌ వచ్చాయి. వ్యాపారాలు చేసుకోవడానికి లక్షల కోట్లు వచ్చాయి. మరి తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుల కుటుంబాలకు ఏం వచ్చింది? 

దళితులను విద్యకు దూరం చేశారు 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ 4,634 ప్రాథమిక పాఠశాలలను బంద్‌ చేశారు. జూనియర్‌ కాలేజీలు మూసేశారు. ఓవైపు మల్లారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలకు యూనివర్సిటీలు ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఐదేళ్ల నుంచి నియామకాలు చేయడం లేదు. దీంతో దళితులు, బలహీనవర్గాల వారు విద్యకు దూరమయ్యారు. చదువుకుంటే హక్కులపై నిలదీస్తారని, అధికారంలో భాగం అడుగుతారనే కేసీఆర్‌ దళిత, గిరిజన వర్గాలను చదువులకు దూరం చేయాలనుకుంటున్నారు. వేటకు ముందు పక్షులకు గింజలు వేసినట్టు, పులి కోసం మేకలను కట్టేసినట్టు ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం దళితబంధు పేరుతో కేసీఆర్‌ బయలుదేరారు. 

దళిత అధికారులను అవమానించి.. 
రాహుల్‌బొజ్జాను సీఎం పేషీలో నియమించినట్టు చెప్తున్న సీఎం కేసీఆర్‌.. రాజీవ్‌శర్మ, ఎస్‌కే జోషి, అనురాగ్‌శర్మల పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించారు. ఆ పదవీకాలం కూడా అయ్యాక సలహాదారులుగా నియమించుకున్నారు. మరి దళితుడైన ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ చంద్రను నెల రోజులకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎందుకు రిటైర్‌ చేశారు? రాష్ట్రపతి హోదాలో ప్రణబ్‌ ముఖర్జీ వచ్చినప్పుడు, గవర్నర్‌ నరసింహన్‌ను కలిసినప్పుడు వారికాళ్లకు మొక్కిన కేసీఆర్‌.. దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి హోదాలో వస్తే కనీసం నమస్కరించారా? దళిత ఐఏఎస్‌ అధికారి మురళి, ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ వంటివారు కేసీఆర్‌ బాధ పడలేక, ఆయన పెట్టే అవమానాలు భరించలేక పదవులు వదులుకున్నారు. అలాంటిది ఇప్పుడు రాహుల్‌బొజ్జాను సీఎం పేషీలో పెట్టామంటూ.. మా చెవిలో పువ్వులు పెడుతున్నారా? 

రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదు: భట్టి 
రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తానంటున్న కేసీఆర్‌.. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను ఎందుకు ఖర్చు పెట్టడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను నిలదీస్తూ కాంగ్రెస్‌ చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. రావిర్యాలలో కాంగ్రెస్‌ నిర్వహించిన ఈ సభలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, జనం పాల్గొన్నారు. ఈ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపించింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసకృష్ణన్, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, నేతలు మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కొండా సురేఖ, దాసోజు శ్రవణ్, పొన్నాల లక్ష్మయ్య, రాములునాయక్, మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, నాగం జనార్దన్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, అజారుద్దీన్, జెట్టి కుసుమకుమార్, అంజన్‌కుమార్‌ యాదవ్, సీతక్క, పుష్పలీల, గడ్డం ప్రసాద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

అన్నీ సిద్ధం చేస్తే ఎమ్మెల్యే అయ్యారు 
తాను ఐఏఎస్‌ అవుదామని అనుకున్నానని, కేసీఆర్‌కు తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్న కేటీఆర్‌.. నమ్మక ద్రోహంతో ఎమ్మెల్యే అయ్యాడు. సిరిసిల్లలో కేకే మహేందర్‌రెడ్డి కష్టపడి పంచభక్ష్య పరమాన్నాలతో అంతా సిద్ధం చేస్తే... ఆయనకు నమ్మకద్రోహం చేశారు. కేటీఆర్‌కు టికెట్‌ ఇచ్చి గెలిపించుకున్నారు.  

>
మరిన్ని వార్తలు