సీఎం దత్తత గ్రామాల్లో ప్రగతిపై చర్చకు సిద్ధం

25 Aug, 2021 01:30 IST|Sakshi
మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌/మేడ్చల్‌ రూరల్‌: సీఎం దత్తత గ్రామాల్లో ప్రగతిపై తాను చర్చకు సిద్ధమని, అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సీఎం దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల దీక్షలో భాగంగా తొలి రోజు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. 2 రోజులు ఇక్కడే ఉంటానని టీఆర్‌ఎస్‌ నాయకులకు చేతనైతే చర్చకు రావాలన్నారు. అభివృద్ధి జరిగినట్లు రుజువైతే ముక్కు నేలకు రాసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సీఎం ఫాంహౌస్‌కు వెళ్లే దారిలో మూడుచింతలపల్లి, కేశవరం, లక్ష్మాపూర్‌ గ్రామాలు ఉండటంతో.. తాను వెళ్లే సమయంలో స్థానికులు అడ్డుకోకూడదనే దత్తత తీసుకుని మోసం చేస్తున్నారని ఆరోపించారు.  

సోనియమ్మ రాజ్యం రావాలి.. 
స్వయం పాలన, సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రావాల్సిన అవసరం ఉందన్నా రు. గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ఎలా కార్యక్రమాలు చేస్తుం దో చూస్తామని కొందరు మాట్లాడుతున్నారని తాను వచ్చే నెలలో కచ్చితంగా అక్కడ సభ నిర్వహిస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకుంటే వారిని తొక్కుకుంటూ వెళ్తానని, అలా వెళ్లడం చేతగాకపోతే గుండు గీయించుకుంటానన్నారు.

ఎన్నికల కోసమే దళితబంధు... 
హుజురాబాద్‌ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాడని రేవంత్‌ ఆరోపిం చారు. జీహెచ్‌ఎంసీలో 6 లక్షల కుటుంబాలకు వర ద సాయం రూ.10 వేలు ఇస్తానని మోసం చేసినట్లే, ఇప్పుడు దళితబంధు పేరుతో మభ్యపెట్టాల ని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేష న్‌ వచ్చే లోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చే స్తారే తప్ప వారికి డబ్బులు ఇవ్వరని ఆయన పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని రేవంత్‌ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఈటల రాజేందర్‌ భూకబ్జాలు చేశాడని, ఆయనను ఏదో చేస్తామని చెప్పిన కేసీఆర్‌ బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఎందుకు చల్లబడ్డారో చెప్పాలన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే సీతక్క, ఇతర కాంగ్రెస్‌ నేతలు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, మహేశ్వర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, బలరాం నాయక్, రాములునాయక్, మల్లు రవి, రాజయ్య, మహేశ్‌కుమార్‌గౌడ్, అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్,  శ్రీధర్‌ ప్రీతమ్, జగన్‌లాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

దళితుడి ఇంట్లో బస.. 
రేవంత్‌.. మంగళవారం సాయంత్రం వరకు దీక్ష చేయగా, రాత్రి గ్రామంలోని బూరుగు యాదగిరి(దళితుడు)కి గతంలో కేటాయించిన ఇందిరమ్మ ఇంటిలో బసచేశారు. నేడు.. ముందు దళితవాడల్లో రచ్చబండ కార్యక్రమం చేపట్టి సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం దీక్ష స్థలికి చేరుకుంటారు. 

రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు...
సీఎం కేసీఆర్‌ మూడుచింతలపల్లిని దత్తత తీసుకొని రూపాయి కూడా ఖర్చు చేయలేదని పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. రాష్ట్ర సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లోనే బంధీ అయ్యాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దళిత గిరిజనులు ఆత్మగౌరవంగా జీవించాలనే కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రమంతా దళితబంధు ఇవ్వాలని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజహ రుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌.. మూడుచింతలపల్లిని కాదు..  స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డిని దత్తత తీసుకున్నారని ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఆరోపించారు. బడ్జెట్‌లో గిరిజనులకు కేటాయించిన నిధులు ఖర్చుచేయలేదని మల్లు రవి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు