ఎన్నికలొస్తేనే పైసలు.. బిడ్డ బిర్లా .. కొడుకు టాటా 

10 Aug, 2021 03:18 IST|Sakshi

ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభలో సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ ధ్వజం 

దళితులు, గిరిజనులు కూడా ఎన్నికలప్పుడే గుర్తొస్తారు 

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా ఇస్తారా..చస్తారా? 

ఈ లక్ష దండుతో కేసీఆర్‌ మెడకు ఉచ్చు బిగిస్తా 

ప్రగతి భవన్‌ గోడలు బద్దలు కొట్టి చర్లపల్లి జైలుకు పంపిస్తా 

ఇక్కడి నుంచే సమరశంఖం ఊదాలి.. దండోరా వేయాలి

సాక్షి, ఆదిలాబాద్‌: ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి దళితులు, గిరిజనులు, బడుగు, బలహీనవర్గాలు యాదికొస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలున్న నియోజకవర్గాలకే పైసలిస్తారంటూ.. 119 నియోజకవర్గాల్లో ఎన్నికలొస్తేనే  కేసీఆర్‌ అందరికీ పైసలిస్తా రని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా ఇస్తారా..? చస్తారా..? వారే తేల్చుకోవాలన్నారు. ‘లక్ష మందికి ఒక్క తల తక్కువగా ఉన్నా నా తల నరుక్కుంటా అన్నా.. లక్షకు ఒక తల తక్కువగా ఉన్నా తల వంచుతా.. ఇంద్రవెల్లిలో వచ్చిన ఈ లక్ష దండుతో కేసీఆర్‌ మెడకు ఉచ్చు బిగిస్తా..’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచే సమర శంఖం ఊదాలని, దండోరా వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా సభ ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగింది. ముందుగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద రేవంత్‌ నివాళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడారు. 

ఏడేళ్లలో ఏం చేశారు? 
‘నీ ఫామ్‌ హౌస్‌లో జాగా అడిగినామా, చింతమడకలో గవ్వ అడిగినామా. చింతమడకలో రూ.15 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నీవు.. 10 పైసలు కూడా దళిత, గిరిజనులకు ఇచ్చినావా?’ అని రేవంత్‌ నిలదీశారు. 70 ఏళ్లలో దళితులు, గిరిజనులకు కాంగ్రెస్‌  చేసిందేమీ లేదంటున్న కేసీఆర్‌ ఈ ఏడేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లతోనే దళితులు, గిరిజనులు అనేక రంగాల్లో అభ్యున్నతి సాధించారని, రాజకీయంగా ఉన్నత పదవులు పొందారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎండగట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి ఒక్కొక్కరి తల మీద లక్ష అప్పు మోపారని విమర్శించారు.  

బిడ్డ బిర్లా .. కొడుకు టాటా 
‘నీ బిడ్డను బిర్లాను చేసినావ్‌. నీ అల్లుళ్ని అంబానీలుగా చేసినావ్‌..కొడుకును టాటా చేసినావ్‌..నీవు నరరూప రాక్షసుడిగా తయారై కుంభకర్ణుడిలా మద్యం తాగి ఫామ్‌ హౌస్‌లో పండుకుంటున్నావ్‌..’ అంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో 20 నెలలే పడుకునేదని, ఫామ్‌ హౌస్, ప్రగతి భవన్‌ గోడలు బద్దలు కొట్టి చర్లపల్లి జైలుకు పంపిస్తానని, అక్కడ సేద తీరాల్సిందేనని అన్నారు. దండోరా సభకు వస్తున్న వేలాది మందిని ఉట్నూర్‌లో అడ్డుకున్నారని, దెబ్బకు దెబ్బ తీస్తామని, కేసీఆర్‌ను బొందపెట్టడం ఖాయమంటూ ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో రావణ రాజ్యం పోవాలని, దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలని అన్నారు. 

సోమవారం దళిత, గిరిజన దండోరా సభలో గుస్సాడి నృత్య ప్రదర్శనను తిలకిస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్‌ 

అన్నీ డైరీలో రాస్తున్నాం 
కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు, ఇతరుల భూములు గుంజుకోవడం, పార్టీ ఫిరాయింపులు అన్ని డైరీలో రాసుకుంటున్నామని రేవంత్‌ పేర్కొన్నారు. అసలు మిత్తితో సహా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇది కార్యకర్తల పార్టీ అని, గ్రామ, మండల, నియోజవర్గ స్థాయిలో కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. ప్రజల కోసమే తానున్నానని, ‘నన్ను నమ్మండి.. ఆశీర్వదించండి.’ అంటూ కోరారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కాయని, మళ్లీ సోనియమ్మ రాజ్యం వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. దండోరా తదుపరి కార్యక్రమం ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 

గిరిజన బంధు అమలు చేయాలి: భట్టి 
జల్, జంగల్, జమీన్‌ కోసం పోరు సల్పిన గడ్డ నుంచి కాంగ్రెస్‌ పోరు ప్రారంభించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై దండోరా మోగివ్వడం కోసమే ఈ సభ అన్నారు. అడవి బిడ్డలను అక్కడినుంచి పంపించేస్తున్నారని, అలాంటి వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఇటు అంబేడ్కర్‌ .. అటు కొమురం భీం   
దండోరా సభ వేదికకు ఇరువైపులా అంబేడ్కర్, కొమురం భీం భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో మొదట కొమురం భీం పోరాటాన్ని వివరించారు. రాంజీ గోండు పోరాట స్ఫూర్తితో కేసీఆర్‌కు గోల్కొండ కోట కింద ఘోరీ కడతామని అన్నారు. భీం రావ్, మడావి రాజు, మడావి తుకారాం, మరు మాస్టార్‌లు ఉన్నత స్థాయిలో రాణించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, మాజీ ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ, మల్లు రవి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, పొన్నం ప్రభాకర్, సంపత్, శ్రావణ్‌కుమార్, మహేష్‌కుమార్‌గౌడ్, జి.వినోద్‌ తదితరులు సభకు హాజరయ్యారు.  

సోమవారం ఇంద్రవెల్లిలో జరిగిన దళిత గిరిజన దండోరా సభలో మాట్లాడుతున్న
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే సీతక్క 

మరిన్ని వార్తలు