తమిళనాడులో బీజేపీకి కేసీఆర్‌ సహకారం

4 Feb, 2021 01:21 IST|Sakshi

ఎన్నికల ఇన్‌చార్జిగా కిషన్‌రెడ్డి నియామకంపై రేవంత్‌ ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్‌చార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నియామకం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాత్ర ఉందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి తమిళనాడు ఎన్నికలకు నిధులు సమకూరుతున్నాయని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సహకారం తమిళనాడుకు పూర్తిస్థాయిలో చేరేందుకే కిషన్‌రెడ్డిని నియమించారని దుయ్యబట్టారు. ఇటీవల కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బీజేపీకి పూర్తిగా సహకరిస్తానని ప్రధానితో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ఇంటెలిజెన్స్‌ను తమిళనాడుకు పంపి బీజేపీకి కేసీఆర్‌ సహకరిస్తున్నారని విమర్శించారు. 

కేంద్ర బలగాల భద్రత కల్పించండి.. 
బ్లూ స్టార్‌ ఆపరేషన్‌ చేసి, తనను అంతమొందిస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ గతంలో హెచ్చరించిన నేపథ్యంలో తనకు కేంద్ర బలగాల భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం అమిత్‌ షాకు వినతిపత్రం ఇచ్చారు. గతేడాది మార్చిలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హోం శాఖకు తన భద్రత విషయంలో విజ్ఞప్తి చేసినప్పటికీ ఏడాదిగా ఎలాంటి ఫలితంలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.  

మరిన్ని వార్తలు