ప్రగతి భవన్‌ను అంబేడ్కర్‌  బహుజన్‌ భవన్‌గా మారుస్తాం

26 Aug, 2021 02:53 IST|Sakshi

బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం దళిత, గిరిజనుల అభివృద్ధికే... 

మల్లారెడ్డి అక్రమాలపై విచారణ జరిపించాలి 

దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు.. ఇక చరిత్రలో నిలిస్తే చాలు 

దీక్ష ముగింపు సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్‌ను అంబేడ్కర్‌ బహుజన్‌ భవన్‌గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలో సీఎం ఎవరైనా సరే టీపీసీసీ అధ్యక్షుడిగా తాను సీఎంగా ఉన్న వారితో దళిత, గిరిజనుల విద్య, అభివృద్ధి కోసం మొదటి సంతకం చేయిస్తానని చెప్పారు. బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం దళిత, గిరిజనుల అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. బుధవారం మూడుచింతలపల్లిలోని దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా బుధవారం సాయంత్రం రేవంత్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి రెండు రోజుల దీక్షను విరమింపజేశారు. సీఎంగా కేసీఆర్‌ రాజభోగాలు అనుభవిస్తున్న ప్రగతిభవన్‌ను అంబేడ్కర్‌ బహుజన్‌ భవన్‌గా మార్చి అక్కడి నుంచే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  

దత్తత పేరుతో దగా.. 
సీఎం కేసీఆర్‌ దత్తత పేరుతో గ్రామాలను దగా చేశారే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మూడుచింతలపల్లిని దత్తత తీసుకునే సమయంలో అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ చేయలేదన్నారు. సీఎం దత్తత గ్రామాలపై తాను చర్చకు సిద్ధమని, అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరినా అధికారంలో ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవడం విడ్డూరమన్నారు. పేదల పిల్లలు చదువుకుంటే రాజ్యాధికారం అడుగుతారని, చైతన్యవంతులు అవుతారని.. అందువల్లే సీఎం కేసీఆర్‌ 4,632 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కాలేజీలు మూసివేయించారని ఆరోపించారు. 

తండ్రి ఓ మాట, కొడుకో మాట 
హుజూరాబాద్‌లో ఓటమి భయం పట్టుకుందని అందుకే సీఎం కేసీఆర్‌ ఒకటంటే.. ప్రెస్‌మీట్‌లో కుమారుడు కేటీఆర్‌ మరోటి అంటున్నారని రేవంత్‌రెడ్డి అన్నా రు. కాంగ్రెస్‌ దండోరా సభలతో కేసీఆర్‌ అనే ఎలుక బయటికొచ్చిందని వ్యాఖ్యానిం చారు. కేసీఆర్‌ జపాన్‌ ఎలుకలాంటి వాడని. ప్రమాదాన్ని ముందే గ్రహించి ఫామ్‌హౌస్‌ నుంచి బయటికొచ్చారని ఎద్దేవా చేశారు. తాను జీవితంలో సుఖంగా జీవిం చేందుకు దేవుడు అన్నీ ఇచ్చాడని, తనకు పదవుల ఆశ లేదని చరిత్రలో గుర్తుండేలా నిలిస్తే చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎలక్షన్‌ కమిటీ మేనేజ్‌మెంట్‌ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల ఇన్‌చార్జి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర నాయకులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మల్లు రవి, నందికంటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్‌... బయట ఉంటే బ్రోకర్‌
మంత్రి మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్‌.. బయట ఉంటే బ్రోకర్‌ అని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నాడన్నారు. నియోజకవర్గంలో ఎవరు భూములు అమ్మినా, కొన్నా ఆయన మామూళ్లు వసూలు చేస్తారని ఆరోపించారు. జవహర్‌నగర్‌లో 268 సర్వే నంబర్‌లో తప్పుడు పత్రాలు సృష్టించి తన కోడలు పేరుతో ఆస్పత్రి నిర్మించారని, సూరారంలో చెరువును కబ్జా చేసి ఆస్పత్రి నిర్మించారని, మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి కేటాయించిన భూమిలో తన బావమరిది శ్రీనివాస్‌రెడ్డి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. మంత్రి, తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుమారులు, బావమరిది ఇలా కుటుంబమంతా కబ్జాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మల్లారెడ్డి అక్రమాలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. మల్లారెడ్డి అక్రమాలను తాను నిరూపిస్తానని, రుజువు చేయలేకపోతే ఏ శిక్ష విధించినా అంగీకరిస్తానని చెప్పారు. 

చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్‌ ఎందుకివ్వరు?

మరిన్ని వార్తలు