రైతుల్ని ముంచుతున్నారు..మోదీ, కేసీఆర్‌పై రేవంత్‌ ధ్వజం

30 Apr, 2022 04:17 IST|Sakshi

ధాన్యాన్ని కొనకుండా, గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసగిస్తున్నారు 

సిద్దిపేట, సిరిసిల్లలో వర్షాలకు తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాల్సిందే

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, గిట్టుబాటు ధర రూ. 1,960 చెల్లించకుండా కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతులను ముంచుతూ మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘ఢిల్లీలో ఉన్నోడు మోదీ.. గల్లీలో ఉన్నోడు కేడీ’అని దుయ్యబట్టారు. మే 6న వరంగల్‌లో పార్టీ నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు జనసమీకరణ కోసం శుక్రవారం నాగార్జునసాగర్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చర్యలు చేపట్టాలని తాము మార్చిలోనే చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. 7 వేల ఐకేపీ కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా కేవలం 2,300 కేంద్రాలే ప్రారంభించిందన్నారు. 15 కోట్ల గొనె సంచులు అవసరమైతే 8 కోట్ల గోనె సంచులకే టెండర్లు పిలిచిందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేటలో అకాల వర్షాలతో కల్లాల్లోని ధాన్యం తడిస్తే కనీసం టార్పాలిన్లు ఇవ్వలేదన్నారు. తడిచిన ధాన్యాన్ని రాష్ట్రమే రూ.1960 కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. 

నెల్లికల్లు పూర్తి చేస్తానన్న జగదీశ్‌రెడ్డి ఎక్కడ? 
నెల్లికల్లును ఏడాదిన్నరలో పూర్తి చేసి 20 వేల ఎకరాలకు నీరిస్తామన్న మంత్రి జగదీశ్‌రెడ్డి ఎక్కడున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 18 నెలలు అయినా కనీసం పునాది రాయి కూడా వేయలేదని, తట్ట మట్టి తీయలేదని విమర్శించారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 9 మందిలో ఒక్కరైనా నల్లగొండకు ని«ధులు తెచ్చిన వారు ఉన్నారా? అన్ని రేవంత్‌ ప్రశ్నించారు. జిల్లాలోని ఎత్తిపోతలు, కాలువలు, ఏఎంఆర్‌పీ, ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లంల తదితర ప్రాజక్టులను కాంగ్రెస్‌ పార్టీయే చేపట్టిందని గుర్తుచేశారు. 

వరంగల్‌కు ఉప్పెనలా... 
రైతు సభకు జిల్లాలోని 34,684 బూత్‌లలో ఉన్న 42 వేల మంది కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి 9 మందిని తీసుకొచ్చి ఉప్పెనలా వరంగల్‌ను కప్పేయాలని రేవంత్‌ పేర్కొన్నారు. పార్టీ విధానాన్ని రాహుల్‌ రైతులకు వివరస్తారని చెప్పారు. కాగా, తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎలాంటి వడ్డీ లేకుండా రూ. లక్ష రుణాన్ని ఇస్తామని మీడియాతో ఇష్టాగోష్టిలో రేవంత్‌ చెప్పారు.

కేసీఆర్‌.. ఉచిత ఎరువులేవీ?: ఉత్తమ్‌ 
బీజేపీ ఎరువుల ధరలు పెంచితే మూడేళ్ల కిందట సీఎం కేసీఆర్‌ ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించి మోసం చేశారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కౌలు రైతుల కోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి లోన్లు ఇస్తే టీఆర్‌ఎస్‌ సర్కారు దాన్ని తీసేసిందని దుయ్యబట్టారు. రైతు బీమా కింద ఒక్క పైసా ఇవ్వలేదని, దానిపైనా రాహుల్‌గాంధీ ప్రకటన చేస్తారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, నల్లగొండ, యాదాద్రి, సూర్యా పేట జిల్లాల పార్టీ అధ్యక్షులు శంకర్‌ నాయక్, కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి, చెవిటి వెంకన్న పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు