కేసీఆర్‌ అవినీతికి అమిత్‌ షా కంచె

17 May, 2022 00:42 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోదండరెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ 

బదులుగా బీజేపీకి ప్రొటెక్షన్‌ మనీ  ఇస్తున్న ముఖ్యమంత్రి 

 వ్యూహాత్మకంగానే    పరస్పరం తిట్ల దండకం 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఆరోపణలు 

సాక్షి, హైదరాబాద్‌: అవినీతితో కేసీఆర్‌ రాష్ట్రాన్ని కొల్లగొట్టారంటూ అమిత్‌షా చెప్పారని, అయితే బీజేపీలో అత్యంత కీలక నేతగా ఉంటూ.. కేంద్ర హోం శాఖను నిర్వహిస్తున్న అమిత్‌షా ఆ ఆవినీతిపై ఎందుకు విచారణ చేయరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు కేసీఆర్‌ అవినీతికి కంచె వేసి కాపాడుతున్నదే అమిత్‌షా అని, అందుకు బదులు కేసీఆర్‌ బీజేపీకి ప్రొటెక్షన్‌ మనీ ఇస్తున్నాడని ఆరోపించారు. తమిళనాడు, యూపీ ఎన్నికలకు కేసీఆరే డబ్బులు ఇచ్చాడని, త్వరలో జరగబోయే గుజరాత్‌ ఎన్నికలకు అవసరమయ్యే అన్ని డబ్బులు కేసీఆరే సమకూరుస్తున్నాడని ఆరోపించారు.

ఇన్ని ఆరోపణలు చేస్తున్నా సత్యహరిశ్చంద్రుడు, కేసీఆర్‌ కవల పిల్లలన్నట్టు ఎందుకు విచారణ జరపరని ప్రశ్నించారు. సోమవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత పార్టీ నేతలు కోదండరెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌లతో కలిసి రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.  

కాంగ్రెస్‌ గురించి మాట్లాడే ధైర్యం లేదు 
కాంగ్రెస్‌ గురించి మాట్లాడే ధైర్యం వారికి లేదని, కాంగ్రెస్‌ మీద ఆరోపణలు చేస్తే ప్రజలు టీఆర్‌ఎస్, బీజేపీ నేతల కళ్లల్లో కారం కొట్టి చీపుర్లతో కొడతారు కాబట్టే కాంగ్రెస్‌ మాట ఎత్తేందుకు భయపడుతున్నారని రేవంత్‌ అన్నారు. తాము ప్రస్తావించిన డిక్లరేషన్‌లోని ప్రధాన అంశాలను గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడే ధైర్యం లేని నేతలు ఒకరినొకరు తిట్టుకుంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒకరు చూస్తుంటే, అధికారాన్ని కొల్లగొట్టాలని మరొకరు ఆలోచిస్తున్నారే తప్ప తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలూ చేయాలనే ఆలోచన వారికి లేదని ధ్వజమెత్తారు.

వరంగల్‌ డిక్లరేషన్‌ను పక్కదారి పట్టించేందుకు వ్యూహాత్మకంగానే ఇరు పార్టీలు తిట్ల దండకాన్ని అందుకున్నాయని, వారి తిట్ల ఎపిసోడ్‌ మలయాళ బూతు సినిమాను తలపించిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎప్పుడూ దేశాన్ని విభజించే ప్రయత్నమే చేస్తుందని, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే మైనార్టీ రిజర్వేషన్లపై అమిత్‌షా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అమిత్‌షా వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ మాట్లాడకపోతే అసదుద్దీన్‌ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు