కరోనా కంటే మోదీ, కేసీఆర్‌ ప్రమాదకారులు 

8 Jul, 2021 01:15 IST|Sakshi
బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అభివాదం చేస్తున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఉత్తమ్, భట్టి, గీతారెడ్డి తదితరులు 

సమష్టిగా అధికారంలోకి వస్తాం 

ఫాంహౌజ్‌లో బందీ అయిన తెలంగాణ తల్లికి కాంగ్రెస్‌ సైన్యం విముక్తి కల్పించాలి 

రెండేళ్లు ఈ రాష్ట్రం, దేశం కోసం పనిచేస్తామని ఇళ్లలో అనుమతి తీసుకోండి 

టీపీసీసీ చీఫ్‌ బాధ్యతల స్వీకరణ సందర్భంగా రేవంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఇక నుంచి సమష్టి నిర్ణయాలు, పోరాటాలతో ముందుకెళ్తుందని, 2023 ఎన్నికల్లో సమష్టిగా అధికారంలోకి వస్తామని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. వ్యక్తిగత నినాదాలు ఇవ్వడం మానుకోవాలని, ఇక నుంచి కాంగ్రెస్‌ ఏకైక నినాదం ‘జై సోనియా’నే అని స్పష్టం చేశారు. వ్యక్తిగత నినాదాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్, ఆయన కుటుంబమేనని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందో మేధావులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళిత, మైనార్టీ, బీసీ, ఎస్టీ వర్గాలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బుధవారం మధ్యాహ్నం 1.31 గంటలకు పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌ మాట్లాడారు.

చాకలి ఐలమ్మ, దొడ్డికొమురయ్య, సురవరం ప్రతాపరెడ్డిల స్ఫూర్తితో నాడు నిజాం నుంచి సాయుధ పోరాటంతో తెలంగాణకు విముక్తి కలిగించామని, అదే స్ఫూర్తితో తెలంగాణలో మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ తెలంగాణను దోచుకుంటున్నాడని, కరోనా కంటే మోదీ, కేసీఆర్‌లు ప్రమాదకారులని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలను 100 మీటర్ల లోతున బొందపెట్టాలంటే కాంగ్రెస్‌లో ఉన్న యువత కంటిమీద కునుకు లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు రేవంత్‌ ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి, నాగార్జునసర్కిల్, మాసాబ్‌ట్యాంక్‌ మీ దుగా నాంపల్లిలోని గాంధీభవన్‌కు చేరుకున్నారు. 

మీరే ఏకే 47లు... ఇక పీకేలు ఎందుకు? 
తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) లాంటి వారిని సలహాదారులుగా పెట్టుకుంటే అధికారంలోకి వస్తారని కొందరు సూచిస్తున్నారని రేవంత్‌ చెప్పారు. అయితే, టీఆర్‌ఎస్‌ గుండెల్లో గునపాలు దింపే ఏకే47 లాంటి కాంగ్రెస్‌ కార్యకర్తలు తనకు అండగా ఉండగా ఇక పీకేలు ఎందుకుని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం, ఈ దేశం కోసం ఈ రెండేళ్లపాటు పనిచేస్తామని ఇళ్లలో అనుమతి తీసుకోవాలని, కునుకు తీయకుండా ప్రతి పల్లె, గూడెంలలో చదువుకున్న యువకులు కాంగ్రెస్‌ నినాదాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

‘రామాయణంలో రావణుడు మాయలేడి వేషంలో వచ్చి సీతమ్మను తీసుకెళ్లి లంకలో బంధించాడు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా తెలంగాణ తల్లిని ఫాంహౌజ్‌లో బంధించాడు. నాడు వానర సైన్యం రాముడికి అండగా ఉండి వారధి నిర్మించి సీతమ్మకు లంక నుంచి విముక్తి కల్పించింది. ఇప్పుడు కాంగ్రెస్‌ సైన్యం కూడా పార్టీకి అండగా ఉండి కేసీఆర్‌ నుంచి తెలంగాణ తల్లి విముక్తి కల్పించాలి. వానర సైన్యం లాగా కాంగ్రెస్‌ సైన్యం పనిచేయాలి’అని వ్యాఖ్యానించారు.

ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.సంపత్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీశ్‌ చోడంకర్, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, సీతక్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజరు కాలేదు. అభినందన లేఖను పంపిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా గైర్హాజరయ్యారు.  

టీపీసీసీ సభలో ఎవరేమన్నారంటే...! 
కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే టీఆర్‌ఎస్‌ను ఓడించగలదు. అందరితో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేశాం. రానున్న 27 నెలల కాలం చాలా కీలకమైంది. అందరూ సమష్టిగా పనిచేయాలి.     – మాణిక్యం ఠాగూర్‌ 
 
తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ, తెచ్చుకుంది రాష్ట్ర ప్రజలు. వనరుల సమాన పంపిణీ కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదీ జలాల్లోనే వివక్ష జరుగుతోంది. సోనియా ఆశయాలను, రాహుల్‌ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలి.
– సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క 
 
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం. 2023 వరకు అందరం కలిసి పనిచేస్తాం. ఇన్నాళ్లు నాకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్‌లకు కృతజ్ఞతలు. 
– టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ 
 
దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేది. కానీ, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత దురదృష్టవశాత్తు పార్టీ బలహీనపడింది. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ సేవలు అవసరం.     – తారిఖ్‌ అన్వర్, కుల్‌దీప్‌రాయ్‌ శర్మ 
 
రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి పునర్వై భవం వస్తుందనడంలో సందేహం లేదు. కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.      – దామోదర రాజనర్సింహ 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు