ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?

11 Nov, 2020 03:59 IST|Sakshi

పట్నా : అతి చిన్న వయసులోనే బిహార్‌ పీఠం ఎక్కాలన్న ఆర్‌జేడీ యువ నేత తేజస్వి యాదవ్‌ కల చెదిరింది. కాంగ్రెస్‌తో జత కట్టడం వల్లే ఆయన కథ మారిపోయిందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైల్లో ఉన్నప్పటికీ, కీలకమైన నేతలందరూ పార్టీని వీడినప్పటికీ తేజస్వి యాదవ్‌ ఈ సారి ఎన్నికల్లో ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. 31 ఏళ్ల వయసున్న తేజస్వి పార్టీ బరువు బాధ్యతల్ని తన భుజం మీద వేసుకొని ఒంటరి పోరాటం చేశారు.

ఎన్నికల ప్రచార సభల్లో తూటాల్లాంటి మాటలతో తేజస్వి చేసిన ప్రసంగాలు, నిరుద్యోగం, వలసవాదుల సమస్యలు, ఆర్థిక సంక్షోభం వంటి విధానపరమైన అంశాలనే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో ముందుకు వెళ్లడంతో అధికార ఎన్డీయేకి ఎదురు దెబ్బ తగులుతుందని అందరూ భావించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా ఈ సారి యువతరం తేజస్వికి జై కొడుతుందని అంచనా వేసింది. మహాకూటమిలో భాగస్వామి కాంగ్రెస్‌కు 70 సీట్లు కేటాయించడం ఆర్జేడీ విజయావకాశాలను దెబ్బ తీసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్‌జేడీకి మద్దతుగా ఉన్న ముస్లిం, యాదవుల ఓటు బ్యాంకులో ముస్లిం ఓటు బ్యాంకుని ఎంఐఎం చీల్చడం ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు. 

కాంగ్రెస్‌కి అత్యధిక సీట్లు కేటాయించారా ?
ఈ సారి ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేస్తే, కాంగ్రెస్‌కి 70 స్థానాలు, లెఫ్ట్‌ పార్టీలకు 23 స్థానాలను కేటాయించారు. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కనీసం 20 స్థానాల్లో గెలవకపోవడం కూటమి కొంప ముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాలను గెలుచుకుంది. ఈసారి 20 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల కంటే తక్కువ సీట్లను సాధించి కూటమి విజయావకాశాలను దెబ్బ తీసింది. ఎన్డీయేకున్న అధికార వ్యతిరేకతను తమకి అనుకూలంగా మలుచుకోవడంలోనూ, అగ్రకులాల ఓట్లను ఆకర్షించడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. ఆ ఓట్లన్నీ చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీ ఎల్‌జేపీ దక్కించుకోవడంతో కాంగ్రెస్‌ కుదేలైంది. కాంగ్రెస్‌ని నమ్మి ఎక్కువ సీట్లు కేటాయించడంతో తేజస్వి ఇరకాటంలో పడిపోయారు. 

చీలిపోయిన ముస్లిం ఓటు బ్యాంకు
ఎంఐఎం, బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీ పార్టీలు కలిసి గ్రాండ్‌ డెమొక్రాటిక్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (జీడీఎల్‌ఎఫ్‌)గా ఏర్పడ్డాయి. ఎంఐఎం 5స్థానాలను గెలుచుకుంది. ఆర్‌జేడీకి మద్దతుగా నిలిచే ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చిందనే చెప్పాలి. మహాఘట్‌బంధన్‌ ఓటమి పాలు కావడంలో జీడీఎల్‌ఎఫ్‌ పాత్ర కూడా ఉంది. 

మరిన్ని వార్తలు