బీజేపీకి చెక్‌: చిరాగ్‌ చెంతకు తేజస్వీ

30 Nov, 2020 12:55 IST|Sakshi

పట్నా : కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ మృతితో బిహార్‌లో రాజకీయం మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. పాశ్వాన్‌ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ సీటు దీనికి కేంద్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జోరుమీదుకున్న ఎన్డీయే కూటమికి చెక్‌ పెట్టాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ ఎత్తులు వేస్తున్నారు. దీనికి లోక్‌జనశక్తి (ఎల్‌జేపీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ను పావుగా ఉపయోగించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. రాం విలాస్‌ పాశ్వాన్‌ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తిరిగి తమ కుటుంబానికే కేటాయిస్తుందని చిరాగ్‌ భావించారు. అయితే ఊహించని విధంగా ఆ స్థానానికి బీజేపీ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ పేరును నామినేట్‌ చేయడం యవనేతకు షాకింగ్‌ కలిగించింది. తన తండ్రి స్థానంలో జరుగుతున్న ఎన్నికకు కనీసం తమకు సంప్రదించకుండా సుశీల్‌ పేరును ఖరారు చేయడం ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. (ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు)

ఈ క్రమంలో చిరాగ్‌తో దోస్తీకి ప్రయత్నం చేస్తున్న తేజస్వీ వ్యూహత్మకంగా ఆలోచన చేశారు. పాశ్వాన్‌ మృతితో జరుగుతున్న ఎన్నికలో ఆయన భార్య, చిరాగ్‌ తల్లి రీనాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో చిరాగ్‌కు దగ్గర కావడంతో పాటు ఎన్డీయే విజయానికి చెక్‌ పెట్టొచ్చని భావిస్తున్నట్లు సమాచారం.  రీనాకు ఆర్జేడీ మద్దతు ఇస్తామని తేజస్వీ ఇదివరకే వర్తమానం పంపినట్లు బిహార్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఆర్జేడీ సీనియర్‌ నేత శక్తీ యాదవ్‌ మాట్లాడుతూ.. రినా పాశ్వాన్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే దానికి ఆర్జేడీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి నిర్ణయం చిరాగ్‌కే వదిలేస్తామని తెలిపారు. ఒకవేళ చిరాగ్‌ ముందుకు రాకపోతే మహాకూటమి తరుఫున సుశీల్‌ మోదీకి వ్యతిరేకంగా తామూ అభ్యర్థిని బరిలో నిలుపుతామని వెల్లడించారు. బిహార్‌ అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేలు కలిగిన ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ సహకారంతో రాజ్యసభ స్థానాన్ని కైవలం చేసుకునే విధంగా ఆర్జేడీ ప్రణాళికలు రచిస్తోంది. (ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?)

మరోవైపు తేజస్వీ ఎత్తుగడ బిహార్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకవేళ చిరాగ్‌ను తనవైపుకు తిప్పుకుంటే ఎల్‌జేపీ సానుభూతిపరులు దాదాపు తేజస్వీ వైపు మళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల విశ్లేషణ. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌తో విభేదించిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జేడీయూపై తీవ్ర ప్రభావం చూపగా.. బీజేపీకి పెద్ద ఎత్తున లాభం చేకూర్చిపెట్టింది. అయితే తాము ఎన్డీయే భాగస్వామ్యం పక్షంగానే కొనసాగుతామని ప్రకటించిన ఎల్‌జేపీ.. ఆ తరువాత బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో మాత్రం చేరలేదు. దీంతో తండ్రి మరణం అనంతరం చిరాగ్‌ ఒంటరి వాడు అయ్యాడనే భావన కలుగుతోంది. దీనిని తేజస్వీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఆర్జేడీ ఆఫర్‌పై చిరాగ్‌ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా