ఎన్డీయేలో టెన్షన్‌.. ప్రధాని అభ్యర్థిగా నితీష్‌!

29 Dec, 2020 16:13 IST|Sakshi

బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలు!

బీజేపీపై ఆగ్రహం వ్యక్తం​ చేస్తున్న జేడీయూ

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో ఏర్పడిన బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలువారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరడం ఇరు పార్టీల మధ్య వైరుధ్యానికి దారితీసింది. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మరో రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలపై గాలం వేయడం రాజనీతి కాదని జేడీయూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిహార్‌ వేదికగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయ చిత్రంలో కొత్త కూటమికి దారి తీసే విధంగా కనిపిస్తున్నాయి. జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను ఎన్డీయే కూటమి నుంచి వెనక్కి తీసుకొచ్చేలా ప్రతిపక్ష ఆర్జేడీ ప్రణాళికలు రచిస్తోంది. అపర చాణికుడ్యిని తమ వైపుకు తిప్పకుంటే ఇక తమకు తిరుగేలేదని భావిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బకు భంగపడ్డ నితీష్‌ కుమార్‌ను చేరదీసేందుకు ఆర్జేడీ నేతలు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే ఆర్జేడీ సీనియర్‌ నేత ఉదయ్‌ నారాయణ్‌ చౌదరీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. (వైదొలిగిన నితీష్‌.. కొత్త వ్యక్తికి బాధ్యతలు)

బీజేపీకి గుడ్‌బై చెప్పి.. తమతో చేతులు కలపాలని సీఎం నితీష్‌ కుమార్‌కు నారాయణ్‌ చౌదరీ సలహా ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పీఠం తేజస్వీ యాదవ్‌కు అప్పగిస్తే.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో నితీష్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంటామని బంపరాఫర్‌ ఇచ్చారు. విపక్ష నేతలందరితో చర్చించి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. దానికి ఆర్జేడీ సిద్ధంగా ఉందని, నితీష్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఆర్జేడీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నితీష్‌ కుమార్‌ఇంకా బీజేపీ మైనర్‌ భాగస్వామ్య పక్షంగా ఉండాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. (బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మె‍ల్యేలు)

భవిష్యత్‌లోనూ బీజేపీతో కలిసే ఉండే జేడీయూను పూర్తిగా దెబ్బతీస్తారని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు సీఎం పగ్గాలు అప్పగించాలని కోరారు. కాగా మొన్నటి వరకు జేడీయూ అధ్యక్షుడిగా కొనసాగిన నితీష్‌.. ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మరో సీనియర్‌ నేత ఆర్‌సీపీ సింగ్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే నితీష్‌ కుమార్‌ మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి పదవి తనకు అక్కర్లేదన్నారు‌. తనకు ఈ పదవిపై ఏ మాత్రం వ్యామోహం లేదని.. బీజేపీ నేతల ఒత్తిడి మేరకే సీఎం బాధ్యతలు చేపట్టానని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితీష్‌ వ్యాఖ్యలు ఎన్‌డీఏ కూటమిలో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే  ఆ​ర్జేడీ  ఇచ్చిన ఆఫర్‌ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆర్జేడీ రాజకీయ వ్యూహాలను బీజేపీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు