నితీష్‌ కుమార్‌కు ఆర్జేడీ ఆఫర్‌

23 Nov, 2020 13:27 IST|Sakshi

పట్నా : బీజేపీ నామినేటెడ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ తమతో చేతులు కలపాలని ఆర్జేడీ సీనియర్‌ నేత అమర్‌నాథ్‌ గమీ వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సీఎం పీఠంలో నితీష్‌ కుమార్‌కు కూర్చోబెట్టడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రానున్న కొద్దికాలంలోనే నితీష్‌ ప్రభుత్వం కూలిపోతుందని తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాఘట్‌బందన్‌ బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్నాలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీదే విజయమని అభిప్రాయపడ్డారు. 

ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ ఎన్నికైనప్పటికీ అధికారమంతా బీజేపీ నేతల చేతుల్లోనే ఉంటుందన్నారు. ఎలాంటి అధికారాలు లేని సీఎం పీఠంలో నితీష్‌ ఉండి ఉపయోగంలేదన్నారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి తమతో చేతులు కలపాలని కోరారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ బీజేపీ ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించాలని అమర్‌నాథ్‌ సూచించారు. కాగా ఇటీవల వెలువడిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది. దీనిపై జాతీయ స్థాయిలో వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయిన్పటికీ ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే నితీష్‌ను సీఎంగా ఎన్నుకున్నామని బీజేపీ చెబుతోంది.
 

>
మరిన్ని వార్తలు