జట్టు కట్టి.. బీజేపీ కట్టడి..

12 Jan, 2022 03:20 IST|Sakshi

బీజేపీ వ్యతిరేక శక్తుల పునరేకీకరణకు కేసీఆర్‌ ప్రయత్నాలు స్పీడప్‌ 

ప్రగతిభవన్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ బృందం భేటీ 

జాతీయ రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాన చర్చ 

ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ తక్షణమే ఏకం కావాలనే అభిప్రాయం 

యూపీ ఎన్నికలతో కార్యాచరణ మొదలుపెట్టాలని నిర్ణయం 

ఆ రాష్ట్రంలో ప్రచారానికి టీఆర్‌ఎస్‌ బృందాలు.. 

అవసరమైతే కేసీఆర్‌ కూడా..

సాక్షి, హైదరాబాద్‌:  జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని నిలువరించేందుకు లౌకికవాద, ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ దిశగా పావులు కదుపుతున్న సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదిశగా మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) నేత, బిహార్‌ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ నేతృత్వం లోని బృందంతో మంగళవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు.

సుమారు రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సం క్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న విచ్ఛిన్నకర, అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ తక్షణమే ఏకం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులు సహా వివిధ వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని గద్దె దించేంత వరకు జరగాల్సిన పోరాటంపై త్వరలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన ఓ మంత్రి ఆ పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. యూపీ రాజకీయాల్లో తాజా పరిణామాలపై కేసీఆర్, తేజస్వి చర్చించి నట్టు సమాచారం. యూపీలో బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటం ఆ పార్టీ పతనానికి ప్రారంభమని వారు విశ్లేషించుకున్నట్టు తెలిసింది.

యూపీ ఎన్నికల్లో ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌కు శరద్‌పవార్‌ మద్దతు ప్రకటించడం కూడా బీజేపీని ఎదుర్కొనే విషయంలో సానుకూల పరిణామని వారు చర్చించుకున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తేజస్వీ బృందం హామీ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ, సాగునీటి రంగ అభివృద్ధి కార్యక్రమాలపై తేజస్వీ ఆరా తీసినట్టు సమాచారం. 

జాతీయ స్థాయిలో పాత్ర పోషించండి: లాలూ 
తేజస్వీ యాదవ్‌తో భేటీ సందర్భంగా ఆయన తండ్రి, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. లాలూ ఆరోగ్యం, క్షేమ సమాచారాన్ని కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్జేడీ మద్దతిచ్చిన విషయాన్ని లాలూ ప్రసాద్‌ గుర్తు చేశారు. ‘‘జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు మీరు ముందుకు రావాలి. తెలంగాణ కోసం త్యాగాలు, పోరాటాలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు.

అన్ని మతాలు,  కులాలు, సబ్బండ వర్గాలకు అనుకూలంగా సాగుతున్న మీ పాలనానుభవం దేశానికి అవసరం. దేశ లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అరాచక పాలననుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకికవాద శక్తులన్నీ ఒక్కటి కావాలి. అందుకు మీరు ముందుకు రావాలి’’ అని సీఎం కేసీఆర్‌ను లాలూ కోరినట్టు సమాచారం. కాగా.. తెలంగాణ భవన్‌కు వచ్చిన తేజస్వీ యాదవ్‌ బృందానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌ తదితరులు స్వాగతం పలికారు. తేజస్వీ బృందంలో బిహార్‌ మాజీ మంత్రి అబ్దుల్‌ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ వ్యతిరేకశక్తుల విశ్వాసం కోసమే? 
‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ నినాదంలో భాగంగా లౌకకవాద, ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్న కేసీఆర్‌.. మరింత వేగంగా ముందుకు అడుగు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గతేడాది డిసెంబర్‌లో చెన్నై వెళ్లిన సీఎం కేసీఆర్‌.. అక్కడ డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 8న ఒకేరోజు సీపీఎం, సీపీఐ పార్టీల జాతీయ అగ్రనేతలతో ప్రగతిభవన్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీల సందర్భంగా బీజేపీ వ్యతిరేక శక్తుల విశ్వాసం చూరగొనే ప్రయత్నంతోపాటు జాతీయ స్థాయిలో ఐక్యత అవసరాన్ని కేసీఆర్‌ నొక్కి చెప్తున్నట్లు సమాచారం.

గతంలో జనతా, జనతాదళ్, యూపీఏ భాగస్వామ్య పార్టీల వైఫల్యానికి కారణాలపైనా ఈ భేటీల్లో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు గణనీయ ప్రభావాన్ని కలిగి ఉన్నా జాతీయ స్థాయిలో వాటి మధ్య సూత్రప్రాయంగా ఐక్యత లేకపోవడం బీజేపీకి కలిసివస్తోందనే అభిప్రాయాన్ని విశదీకరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతను చాటేందుకు జాతీయ స్థాయిలో ఒక సదస్సునుగానీ, సమావేశాన్ని నిర్వహించాలనే ప్రతిపాదనను ముందుకు తెస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. 

యూపీతో మొదలుపెడదాం.. 
బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో గట్టిగా గొంతు వినిపిస్తున్న టీఆర్‌ఎస్‌.. యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో జరుగనున్న యూపీ ఎన్నికల ప్రచారానికి.. టీఆర్‌ఎస్‌ బృందాన్ని పంపేందుకు చురుకైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితాను కేసీఆర్‌ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అవసరమైతే తాను కూడా యూపీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్లాలనే అభిప్రాయాన్ని కూడా కేసీఆర్‌ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. యూపీ ఎన్నికల సమయంలోనే బీజేపీ వ్యతిరేక శక్తుల సదస్సును నిర్వహించాలనే ప్రతిపాదనను మంగళవారం నాటి భేటీలో తేజస్వీ ముందు పెట్టినట్లు తెలిసింది.  

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌–ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ భేటీలో అభిప్రాయాలివి..
►బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు గణనీయ ప్రభావాన్ని కలిగి ఉన్నా.. జాతీయ స్థాయిలో వాటి మధ్య సూత్రప్రాయంగా ఐక్యత లేకపోవడం బీజేపీకి కలిసివస్తోంది. అందువల్ల ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ తక్షణమే ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీని గద్దె దించేంత వరకు జరగాల్సిన పోరాటంపై త్వరలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలి. 
►యూపీ ఎన్నికల సమయంలోనే దీనికి బీజం పడాలి. బీజేపీ వ్యతిరేక ప్రచారం కోసం మంత్రులు, సీనియర్లతో కూడిన ప్రచార బృందాన్ని పంపేందుకు సిద్ధం. అవసరమైతే సీఎం కేసీఆర్‌ కూడా వెళ్లాలనే అభిప్రాయం. 
►బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్దతు. 

‘జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు మీరు ముందుకు రావాలి. దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. మీ పాలనానుభవం దేశానికి అవసరం. బీజేపీ అరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకిక శక్తులన్నీ ఒక్కటి కావాలి. అందుకు మీరు ముందు నడవాలి’ 
– సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ చీఫ్, బిహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ 

చదవండి: (ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ)

>
మరిన్ని వార్తలు