సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలం: మంత్రి

5 Sep, 2020 12:19 IST|Sakshi

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు: కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ కీలక వ్యాఖ్యలు

పట్నా/న్యూఢిల్లీ: ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసేలోగానే బిహార్‌లో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌(ఆర్కే సింగ్‌) శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒంటరిగానే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని ధీమా వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా కొనసాగిందని, ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో జనతాదళ్‌ పార్టీతో పొత్తు కొనసాగుతుందని, లోక్‌సభ ఎన్నికల ఫలితం సీట్ల పంపకంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయం చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. (చదవండి: ఎన్డీయేలో చేరనున్న జితన్‌ రామ్‌ మాంఝీ)

‘‘బిహార్‌లో మేం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం. అందులో ఎలాంటి సందేహం లేదు. 1996 నుంచి జేడీయూతో బంధం ఉంది. దానిని వదులుకోవాలని అనుకోవడం లేదు. మా స్నేహితులను వదులుకోం. అందుకే సీట్ల పంపకం ప్రక్రియలో సున్నితంగా వ్యవహరిస్తున్నాం. అలా అని మా మధ్య విభేదాలలేమీ లేవు. లోక్‌సభ ఎన్నికల ప్రభావం అయితే దీనిపై ఉంటుందని చెప్పగలను’’ అని ఆర్కే సింగ్‌ చెప్పుకొచ్చారు. కాగా కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన బిహార్‌లోని అరా నియోజకవర్గ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.‍ ( చదవండి: నవంబర్‌ 29లోగా బిహార్‌ ఎన్నికలు)

ఇక ఆర్కే సింగ్‌ వ్యాఖ్యలపై జేడీయూ సీనియర్లు, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఏవిధంగా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జితన్‌ రామ్‌ మాంఝీ, శరద్‌ యాదవ్‌ వంటి సీనియర్‌ నేతల ఘర్‌ వాపసీకి రంగం సిద్ధం చేసిన జేడీయూ సీట్ల సర్దుబాటు విషయంలో ఎలా ముందుకు సాగుతుందనేది చర్చనీయాంశమైంది. జితన్‌ రామ్‌ మాంఝీని ఎన్డీయేలోకి ఆహ్వానించిన జనతాదళ్‌ హిందుస్తానీ అవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎమ్‌) పార్టీకి తొమ్మిది సీట్లు కేటాయించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.(చదవండి: నితీశే బిహార్‌ సీఎం అభ్యర్థి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా