యుగతులసి పార్టీకే రోడ్డు రోలర్‌ గుర్తు? 

20 Oct, 2022 09:56 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కే రోడ్డు రోలర్‌ గుర్తును కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ నెల 17 రాత్రి జరిగిన నామినేషన్ల ఉపసంహరణ తరువాత రోడ్డు రోలర్‌ గుర్తు లాటరీ పద్ధతిలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు వచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన మీడియాకూ వెల్లడించారు. అయితే 18న బయటకు వచ్చిన జాబితాలో మాత్రం ఆయనకు బేబీ వాకర్‌ గుర్తును కేటాయించినట్లుగా ఉంది. దీంతో శివకుమార్‌ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. గుర్తుల కేటాయింపు రోజున తనకు రోడ్డురోలర్‌ కేటాయించిన అధికారులు.. మరుసటిరోజు జాబితాలో ఆ గుర్తు లేకుండా చేశారని, తన గుర్తును మార్చేశారని ఫిర్యాదు చేశారు.

తమ కారు గుర్తును పోలి ఉన్న రోడ్డురోలర్, క్యాప్, చపాతి రోలర్‌ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్‌ఎస్‌ పార్టీ 17వ తేదీ రాత్రి ఆందోళన చేసింది. దీంతో తెల్లారేసరికి గుర్తులు మారిపోయాయని, దీనిపై వివరణ కోసం తాను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని శివకుమార్‌ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం భారత ఎన్నికల సంఘం వద్దకు కూడా వెళ్లడంతో, వారు పరిశీలన జరిపి రోడ్డు రోలర్‌ గుర్తును శివకుమార్‌కే కేటాయించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు గుర్తుల విషయంలో రిటర్నింగ్‌ అధికారిపైనా చర్యలకు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు, ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు