BJP MP Roopa Ganguly: బెంగాల్‌లో హింస.. ప్రజలను బతకనివ్వండి అంటూ కన్నీరుపెట్టిన ఎంపీ.. వీడియో

25 Mar, 2022 14:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న బీర‍్బమ్‌ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా ఈ ఘటన పార్లమెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఈ ఘటనపై రాజ్యసభలో మాట్లాడుతూ ఉద్వేగానికిలోనై ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు.

జీరో అవర్‌లో భాగంగా ఆమె శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. బెంగాల్‌ను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బెంగాల్‌లో జరిగిన బీర్బమ్‌ హింస గురించి ప్రస్తావించారు. బెంగాల​ రాష్ట్రంలో దారుణ హత్యలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అక్కడ కేవలం 8 మంది మాత్రమే మరణించారని, ఎక్కువ మంది చనిపోలేదని మమత సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

మరోవైపు ఆమె ఈ విషయంపై మాట్లాడుతున్న సమయంలో తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఆమె మాట్లాడుతూనే అటాప్పీ రిపోర్ట్‌ ప్రకారం.. చనిపోయిన వారిని మొదట దారుణంగా కొట్టారని ఆ తర్వాత సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయని రూపా గంగూలీ ఆరోపించారు. భార‌త్‌లో బెంగాల్ భాగ‌మ‌ని, అక్క‌డ జీవించే హ‌క్కు ఉంద‌ని, మేం బెంగాల్‌లో పుట్టామ‌ని, అక్క‌డ పుట్ట‌డం త‌ప్పుకాదు అని, మ‌హాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడుతూ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకున్నారు.

అయితే, గత సోమవారం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. దాదాపు డజను ప్రత్యర్థుల ఇళ్లకు కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 8మంది సజీవదహనం అయ్యారు. తృణమూల్ బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్‌ హుస్సేన్ సహా 23మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు.. బీర్బమ్‌ సజీవదహనాల కేసులో కోల్‌కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ శుక‍్రవారం తీర్పు వెలువరించింది.

మరిన్ని వార్తలు