ప్రగతి భవన్‌కు గజరాజు మీద వెళ్లే రోజు ఎంతో దూరం లేదు

10 Sep, 2021 08:21 IST|Sakshi
మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

హస్తినాపురం(హైదరాబాద్‌): తెలంగాణలో దోపిడీ, గడీల పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని.. బంగారు తెలంగాణ కాదు బంజరు తెలంగాణగా తయారయ్యిందని మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాం శేఖర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎస్పీ కార్యకర్తల సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సబ్బండవర్గాలు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. అది మరచిపోయి అనచివేతే లక్ష్యంగా పని చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రగతిభవన్‌కు గజరాజు మీద వెళ్లే రోజులు ఎంతో దూరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 800మంది వివిధ పార్టీల నుంచి ప్రవీణ్‌కుమార్‌ సమక్షంలో బీఎస్పీలో చేరారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పసుల బాలస్వామి, కటికల శ్రీహరి, దర్మేందర్, రాంచందర్, విజయ్, జగన్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: కేసీఆర్‌ పోటీ చేస్తే బరిలోకి రేవంత్‌రెడ్డి 

మరిన్ని వార్తలు