రాబోయే రెండేళ్లు కీలకం.. ఈనెల 8న సభ: ప్రవీణ్‌ కుమార్‌

2 Aug, 2021 07:29 IST|Sakshi

బహుజన రాజ్యం తెచ్చుకుందాం

పాలమూరు నుంచే మార్పు తీసుకొద్దాం

మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

జడ్చర్ల టౌన్‌: తెలంగాణలో బహుజన రాజ్యం తెచ్చుకునేందుకు ముందుకు సాగాలని మాజీ ఐపీఎస్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో ఉమ్మడి జిల్లా బహుజన సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లు ఎంతో కీలకమని, ప్రతి నిమిషం ఎంతో విలువైందని గుర్తుంచుకోవాల న్నారు. ఇక్కడ వేసిన అడుగులు ప్రగతిభవన్‌ వెళ్లే వరకు ఆ పొద్దని చెప్పారు.

బండలు పిండిచేసి ప్రాజెక్టులు నిర్మించిన కూలీల జిల్లాగా పాలమూరుకు పేరుందని, అదే తరహాలో బహుజన రాజ్యం సాధించుకునేందుకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. తన రాజీనామాతో ఫాంహౌజ్‌లు కూలటానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. తను రాజీనామా చేసిన మరుసటి రోజే కేసు పెట్టారని, అయినా భయపడేది లేదన్నారు. ప్రాణమున్నంత వరకు స్వేరోగానే ఉంటానని పేర్కొన్నారు. నల్లగొండలో ఈనెల 8న నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అంతకుముందు జడ్చర్ల క్రాస్‌రోడ్‌నుంచి ఇంపీరియల్‌ గార్డెన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. 

మరిన్ని వార్తలు